దేశ అత్యున్నత పదవిలో మహిళా నేత!

  • ప్రగతి భవన్ పంచాంగ శ్రవణంలో కామెంట్

ప్రగతి భవన్ పంచాంగ పఠనంలో పరోక్షంగా రాష్ట్రపతి ఎన్నికల ప్రస్తావన వినిపించింది. శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది సంబురాల్లో భాగంగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పండితుడు సంతోశ్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తారని చెప్పారు. వ్యాపారం, క్రీడలు, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో మహిళా లోకం విజయాలు సాధించబోతోందన్నారు. దేశంలో అత్యున్నత పదవి కూడా ఓ మహిళకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రెండు నెలల్లోనే దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంచాంగ శ్రవణంలో ఈ కామెంట్స్ ఆసక్తిని రేపుతున్నాయి. ఇక రాష్ట్ర రాజకీయాల్లోనూ మహిళలకు మంచి అవకాశాలు దక్కబోతున్నాయన్నారు పంచాంగ పఠనం చేసిన పండితుడు సంతోశ్ శాస్త్రి. తెలంగాణలో మహిళా ఐఏఎస్‌లకు అద్భుతమైన ఫలితాలు అందనున్నాయని, వారి పనితీరుతో రాష్ట్రం సుసంపన్నం కాబోతోందని చెప్పారు. మొత్తంగా ఇంటా బయటా మహిళల నిర్ణయాలు చాలా కీలకంగా మారుతాయని, చురుగ్గా ముందుకు వెళ్తే ఈ శుభకృత్ నామ సంవత్సరం మహిళా నామ సంవత్సరంగా మారుతుందని అన్నారు.

కాగా, ప్రగతి భవన్‌లో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి.  సీఎం కేసీఆర్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి,  స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించారు. శుభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

మరిన్ని వార్తల కోసం..

శ్రీలంకలో ఎమర్జెన్సీ

‘ఆర్ఆర్ఆర్’పై కంగనా రనౌత్ ప్రశంసలు

రష్యా భూభాగంపై ఉక్రెయిన్ అటాక్