ఇప్పుడేం చేద్దాం?.. బీఆర్ఎస్​లో టికెట్లు దక్కక మహిళా లీడర్ల నారాజ్​

ఇప్పుడేం చేద్దాం?.. బీఆర్ఎస్​లో టికెట్లు దక్కక మహిళా లీడర్ల నారాజ్​
  • 2014, 2018లోనూ ఇదే సీన్
  • ప్రత్యామ్నాయ మార్గాలపై నజర్​

మహబూబ్​నగర్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహిళా లీడర్లకు బీఆర్ఎస్  పార్టీ గుర్తింపు ఇవ్వడం లేదు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ పార్టీ లీడర్లు పోరాటం చేస్తున్నారే తప్ప, రాష్ట్రంలో ఈ ఈక్వేషన్​ను పాటించలేదు.  ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అందులో ఒక్క మహిళకూ అవకాశం ఇవ్వలేదు. దీంతో మహిళా లీడర్లంతా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు.

మూడు ఎన్నికల్లోనూ అంతే..

తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. త్వరలో మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, కొన్ని నియోజకవర్గాల నుంచి మహిళా లీడర్లు పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సొంతంగా కేడర్​ను సిద్ధం చేసుకున్నారు. కానీ, గులాబీ బాస్  ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో అన్ని చోట్ల సిట్టింగులకే టికెట్లు కన్​ఫాం చేస్తూ ఇటీవల ఫస్ట్ లిస్ట్​ రిలీజ్ చేశారు. దీంతో ఆయా స్థానాల్లో టికెట్లపై ఆశలు పెట్టుకున్న వారంతా నారాజ్​లో ఉన్నారు. 2014 ఎన్నికల నుంచి ఆ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఒక్క మహిళా లీడర్​కు కూడా అవకాశం ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన రంగినేని శారదకు మహబూబ్​నగర్  పార్లమెంట్ పరిధిలో ఏదో ఒక అసెంబ్లీ నుంచి టికెట్  ఇస్తారనే టాక్ నడిచింది.

తీరా ఎన్నికల టైంలో ఆమెకు టికెట్  ఇవ్వలేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఫుడ్  కార్పొరేషన్  చైర్మన్​గా నామినేటెడ్  పోస్టు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అమరచింత మాజీ ఎమ్మెల్యే సల్గూటి స్వర్ణాసుధాకర్​రెడ్డి ప్రస్తుతం పాలమూరు జడ్పీ చైర్​పర్సన్ గా కొనసాగుతున్నారు. గతంలో అమరచింత ఎమ్మెల్యేగా పని చేశారు. అయితే ఈసారి మక్తల్  లేదా దేవరకద్ర నుంచి పోటీ చేయాలని ఆమెపై కేడర్  ఒత్తిడి తెచ్చారు. మహిళా కోటా కింద టికెట్ వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు.

కానీ సిట్టింగ్​కే టికెట్  కేటాయించారు. నారాయణపేట జడ్పీ చైర్​పర్సన్  వనజమ్మ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినట్లు తెలిసింది. ఈ విషయంపై కేడర్​తో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. హైకమాండ్  చాన్స్  ఇస్తే మక్తల్  నుంచి పోటీ చేసేందుకు రెడీ అయినా ఆశలు గల్లంతయ్యాయి. వెల్దండ జడ్పీటీసీగా పని చేస్తున్న విజితారెడ్డికి కల్వకుర్తిలో బలమైన క్యాడర్  ఉంది. అక్కడి నుంచి పోటీ చేసే సత్తా ఉన్నా, లీడర్లు ఆమెను రాజకీయంగా ఎదగనీయకుండా అణగదొక్కారనే విమర్శలున్నాయి. పార్టీ కూడా తగిన ప్రియారిటీ ఇవ్వలేదని అంటున్నారు. 

పోటీ కోసం పార్టీ మార్పు..

జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన అధికార పార్టీ జడ్పీ చైర్​పర్సన్  సరిత తిరుపతయ్య గద్వాల నుంచి పోటీ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఎమ్మెల్యే, జడ్పీ చైర్​పర్సన్  వర్గాలుగా క్యాడర్​ రెండుగా చీలిపోయింది. ఎవరికి వారు సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. 

అయితే, కొద్ది రోజుల కింద ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్ ఓపెనింగ్​కు వచ్చిన సీఎం గద్వాల టికెట్  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డికే మళ్లీ ఇస్తున్నామని ప్రకటించారు. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న జడ్పీ చైర్​పర్సన్  ఇటీవల కాంగ్రెస్  పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి టికెట్​ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు సమాచారం. 

అడుగడుగునా అవమానాలు..

రూలింగ్ పార్టీకి చెందిన జడ్పీటీసీలు, జడ్పీ చైర్​పర్సన్లు, మున్సిపల్  చైర్​పర్సన్లు తరచూ అవమానాలు ఎదుర్కొంటున్నారు. వీరికి హైకమాండ్ పదవులు కట్టబెట్టిందే తప్ప, కనీసం లోకల్ గా ప్రియారిటీ కూడా ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. స్థానికంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలతో వీరు నిత్యం అవమానాలకు గురవుతున్నా హైకమాండ్ పట్టించుకోలేదనే వాదన వస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వీరిని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచి ప్రియారిటీ ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు. స్టేజీల మీద కూర్చీలు కూడా వేయకుండా అగౌరవపరుస్తున్నారు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేల స్పీచ్​లను మాత్రమే సోషల్  మీడియాలో పోస్ట్​ చేసి, మహిళా లీడర్ల ప్రియారిటీని తగ్గిస్తున్నారనే విమర్శలున్నాయి.