తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో.. మహిళా నేతల మధ్య కీలక పోటీ

తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో.. మహిళా నేతల మధ్య కీలక పోటీ

తెలంగాణ  పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు రానున్నారు. ఇప్పటికే ఇద్దరి పేర్లు దాదాపు ఖరారు కాగా.. మరో రెండు పోస్టుల కోసం నాలుగు పేర్లను పార్టీ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ కు పంపించింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ (ఆర్గనైజేషన్), మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కు  వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఖాయమైనట్లు తెలిసింది. ఇక మూడో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం మాదిగ సామాజిక వర్గం నుంచి కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పేర్లు పంపించగా, ఒకరిని హైకమాండ్ ఎంపిక​చేయనుంది. నాలుగో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం బీసీ మహిళా నేతను ఎంపికచేయనున్నారు.  ఈ పోస్టు కోసం గద్వాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ సరితా యాదవ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు పోటీ పడుతున్నారు.

మహిళా నేతల మధ్య తీవ్ర పోటీ.. 

నాలుగో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం ఇద్దరు మహిళా నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటు మహిళ, అటు బీసీ కోటా కింద గద్వాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ సరితా యాదవ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు (ముదిరాజ్)లలో ఎవరిని ఫైనల్​చేస్తారోననే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. సరితా యాదవ్ పేరును సీఎం రేవంత్ రెడ్డి సిఫారసు చేయగా,  సునీతా రావు పేరును ఢిల్లీ పెద్దలు సూచిస్తున్నట్లు సమాచారం. ఆరు నెలల కిందే మహిళా కాంగ్రెస్ చీఫ్ పోస్టు కోసం సరితా పేరును సిఫారసు చేస్తూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ విభాగం నేషనల్​చీఫ్ అల్కా లంబాకు లేఖ పంపించారు. దీన్ని పసిగట్టిన సునీతా రావు తనకున్న పరిచయాలతో ఢిల్లీలో లాబీయింగ్ చేసి తన పదవిని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. దీంతో సరితకు కనీసం వర్కింగ్ పోస్టు ఇవ్వాలని రేవంత్ పట్టుబడుతుండగా, మహిళతో పాటు బీసీ కోటాలో ఈ పదవి తనకే ఇవ్వాలని సునీతారావు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీంతో సరిత, సునీతలలో ఈ పదవి ఎవరిని వరించనుందనేది ఆసక్తి రేపుతోంది.