దళిత మహిళలకు పెద్దపీట: జడ్పీ చీఫ్ లు.. మినిస్టర్లు

మహిళా చైతన్యానికి తెలుగు రాష్ట్రాలు వేదికగానిలిచాయి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఆడవారు తమ ప్రతిభ చాటుకున్నారు. మొత్తం 32 పరిషత్‌ల్లో 50 శాతం (16 పరిషత్‌లు) మహిళలకే కేటాయించినప్పటికీ, అంతకుమించి 20 చోట్ల చైర్‌పర్సన్లుగా ఎన్నిక కావడం విశేషం. వీరిలో  స్వర్ణ సుధాకర్‌రెడ్డి, కోవ లక్ష్మి ఎమ్మెల్యేలుగానూ, పట్నం సునీతా రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గానూపనిచేసిన అనుభవం ఉంది.  మిగతావారిలో తొలిసారిగా రాజకీయ ప్రవేశం చేసినవారే ఎక్కువమంది ఉన్నారు. మహబూబాబాద్‌ జెడ్పీకి తొలి చైర్‌పర్సన్‌గా అంగోతు బిందు (23) ఫ్రెష్‌ ఫ్రం కాలేజీగా చెప్పుకోవాలి. అలాగే, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకి మొట్టమొదటి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన జక్కు శ్రీహర్షిణి ఇన్ఫోసిస్‌లో మంచి ఉద్యోగాన్ని వదులుకుని ప్రజాసేవకు సిద్ధమయ్యారు. ఉన్నత విద్యావంతులైన డాక్టర్‌ తీగల అనితా రెడ్డి రంగారెడ్డి చైర్‌పర్సన్‌గా, బీఈడీ టీచర్‌గా పనిచేసిన వేలేటి రోజా శర్మ సిద్దిపేట జెడ్పీ చైర్‌పర్సన్‌ గా ఎన్నికయ్యారు.

ఏపీ హోంమినిస్టర్‌గా తొలి దళిత మహిళ

దళిత ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తొలి మహిళా హోం మంత్రి కాగా, గిరిజన తెగకు చెందిన పాముల పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం పోస్టు లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో హోం శాఖ దక్కించుకున్న తొలి మహిళగా సబితా ఇంద్రారెడ్డి రికార్డు సృష్టించగా, ఆ తర్వాత  విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళాహోం  మినిస్ట్రీ సుచరితకు దక్కింది.  ఒక దళిత మహిళకు ఈ రికార్డు దక్కడం మరో విశేషం. మేకతోటి సుచరిత సొంత ఊరు గుంటూరు జిల్లా ఫిరంగిపురం. డిగ్రీ చదివాక వైఎస్ రాజశేఖర రెడ్డి  స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా పనిచేశారు. 2006లో కాంగ్రెస్ టికెట్‌తో ఫిరంగిపురం జడ్పీటీసీగా గెలిచారు. తర్వాత 2009లో ప్రత్తిపాడు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 2012 లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. తర్వాత జరిగిన బై ఎలక్షన్ లో విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేండిడేట్‌  రావెల కిశోర్ బాబు చేతిలో ఓడిపోయారు. తాజాగా  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి టీడీపీ కేండిడేట్ డొక్కా మాణిక్య వర ప్రసాద్‌పై ఏడు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  సుచరితతో పాటు మరో ఇద్దరు మహిళలు పుష్ప శ్రీవాణి, తానేటి వనితకు కేబినెట్‌లో చోటు దక్కింది.

డిప్యూటీ సీఎంగా పుష్ప శ్రీవాణి

ఎస్టీ వర్గానికి చెందిన పాముల పుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎం గా నియమితులై గిరిజన వ్యవహారాలను చూడనున్నారు.  టీచర్‌గా పనిచేసిన పుష్ప శ్రీవాణి, భర్త ప్రోత్సాహంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఎస్టీలకు రిజర్వు చేసిన విజయనగరం జిల్లా కురుపాం నుంచి ఆమె గెలవడం ఇది రెండోసారి.  2014 ఎన్నికల్లో ఆమె తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తాజా  ఎన్నికల్లోనూ పోటీ చేసి 26 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో అందరి కంటే చిన్న వయసు  పుష్ప శ్రీవాణిదే (31 ఏళ్లు).