మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు అరెస్ట్

 మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు అరెస్ట్

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లోని మావోయిస్టు పార్టీ పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు ఓయెమ్ నందే అలియాస్​సమ్మక్క అరెస్ట్ అయ్యారు.  భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం సీతానగరంలో గురువారం సీఆర్పీఎఫ్​, స్పెషల్​పార్టీ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. బీజాపూర్​జిల్లా బాసగూడ పరిధి కొత్తగూడకు చెందిన ఆమె ఆటోలో దమ్ముగూడెం వస్తుండగా పోలీసులు అనుమానించి ఆపి తనిఖీలు చేశారు. 

ఆమె వద్ద కరపత్రాలు, విప్లవ సాహిత్యం లభించాయి. వెంటనే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్​కోసం జైలుకు తరలించినట్లు భద్రాచలం ఇన్ చార్జ్ డీఎస్పీ రవీందర్​రెడ్డి తెలిపారు. ఓయెమ్ నందే 1999లో 16వ ఏటనే మావోయిస్టు పార్టీలో చేరారు. 2002 వరకు బాసగూడ బాలల సంఘం సభ్యురాలిగా, 2002 నుంచి 2018 వరకు పామేడు ఏరియాలో కేఏఎంఎస్​( క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం) దళ సభ్యురాలిగా, 2018 నుంచి ఏరియా కమిటీ అజ్ఞాత దళ సభ్యురాలిగా ఆమె వ్యవహరిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.