మహిళలు పురుషులతో పోటీపడి అన్ని రంగాల్లో సమానంగా ముందుకు దూసుకుపోతున్నా, సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెండుతున్నా కానీ ఇప్పటికీ మహిళలు అత్తింటి వేధింపులు, వివక్షకు గురవుతూనే ఉన్నారు. మగపిల్లాడినే కనాలంటూ అత్తమామలు మొదటిరాత్రి నుండే మహిళపై ఒత్తిడి తెచ్చిన సంఘటన కేరళలో చోటు చేసుకుంది. మగపిల్లాడ్ని కనాలంటే ఎలా మసులుకోవాలో చెబుతూ మొదటిరాత్రి నుండే అత్తమామలు ఒత్తిడి చేస్తున్నారని కేరళలో ఓ మహిళా హైకోర్టును ఆశ్రయించింది.
ప్రి కాన్సెప్షన్, ప్రి నాటల్ డయాగ్నిస్టిక్ టెక్నీక్స్ యాక్ట్ 1994 చట్టం కింద హైకోర్టులో కేసు వేసింది సదరు మహిళ. 2012లో వివాహమైన ఆ మహిళకు మగపిల్లాడ్ని మాత్రమే కనాలని, అందుకు గాను ఫాలో అవ్వాల్సిన గైడ్ లైన్స్ కలిగిన నోట్ ని తన అత్తమామలు భర్తతో పంపారని, ఆ తర్వాత 2014లో ఆడపిల్ల పుట్టగా అప్పటి నుండి అత్తింటివారు వేధిస్తున్నారని ఆమె పిటిషన్ లో పేర్కొంది.అక్షరాస్యతలో టాప్ లో ఉన్న కేరళలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది హై కోర్ట్.