నిర్మల్ జిల్లాపై ‘ఆమె’ ముద్ర.. ప్రభుత్వ శాఖల నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా అధికారులు

నిర్మల్ జిల్లాపై ‘ఆమె’ ముద్ర.. ప్రభుత్వ శాఖల నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా అధికారులు
  • పరిపాలన, శాంతిభద్రతల పరిరక్షణతో ప్రత్యేక గుర్తింపు 
  • ఆదర్శంగా నిలుస్తున్న పలువురు మహిళా అధికారులు 

నిర్మల్, వెలుగు:  నిర్మల్ జిల్లాలోని  ప్రభుత్వ శాఖల నిర్వహణలో మహిళా అధికారులే కీలక పాత్ర పోషిస్తున్నారు.  పరిపాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ  ప్రజల,  ప్రభుత్వ మన్ననలు అందుకుంటున్నారు. ఎస్పీ  జానకి షర్మిల శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

బాసర  ట్రిపుల్ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు ఆ విద్యాసంస్థను దత్తత తీసుకున్నారు. కేజీబీవీల్లో విద్యార్థినులకు మనోధైర్యం కల్పించేందుకు పోలీస్ అక్క పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సైబర్ నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. లక్షలాది మందికి ఉపాధినిస్తున్న ఈజీఎస్ విభాగ బాధ్యతలు చూస్తున్న డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి సమాజానికి ఉపయోగపడే అనేక ప్రయోగాత్మక కార్యక్రమాలు చేపడుతూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.  నిర్మల్ ఆర్డీవోగా రత్న కల్యాణి పని చేస్తున్నారు.  

కలెక్టర్, ఎస్పీలకు సీఎం ప్రశంసలు

కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిళ పరిపాలన, శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు సమన్వయంతో వాటిని పరిష్కరిస్తున్నారు.  బాసర ట్రిపుల్ఐటీలో విద్యార్థులు ఆందోళనలు చేసిన సమయంలో,  ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గుండంపల్లితో పాటు మరో 8 గ్రామాల ప్రజలు దిలావర్​పూర్ హైవేపై రాస్తారోకో  చేపట్టినప్పుడు  ఈ ఇద్దరు మహిళా ఉన్నతాధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు.

ఆ సమయంలో  సమస్యను పరిష్కరించిన తీరును చూసి సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. సైబర్ మోసాలను ఎస్పీ సీరియస్​గా తీసుకుంటున్నారు. రూ. కోట్లలో సాగిన బిట్ కాయిన్ దందా గుట్టును రట్టు చేసి, రాజకీయ ఒత్తిళ్లను సైతం పక్కనపెట్టి, సూత్రధారులను జైలుకు పంపారు.