
- మహిళ సమాఖ్యలకు బాధ్యతలు అప్పగిస్తున్న ప్రభుత్వం
- పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డిలో పూర్తికావస్తున్న పనులు
- ఐఓసీఎల్ తో 20 ఏళ్ల ఒప్పందం
సంగారెడ్డి, వెలుగు: మహిళలతో పూర్తిస్థాయిలో నడిచే పెట్రోల్ బంకులు అందుబాటులోకి రానున్నాయి. మరో 15 రోజుల్లో వాహనదారులకు సేవలందించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలను అప్పగించనుంది. మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయించి వారితోనే ఆ బంకులను నడిపించేందుకు చర్యలు చేపట్టింది. సంగారెడ్డి జిల్లాలో మొదటి విడతగా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం కార్యాచరణ మొదలుపెట్టింది.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 18,756 స్వయం సహాయక మహిళా సంఘాలు ఉండగా, అందులో 1,90,381 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి పథకానికి మగువల నుంచి ఆదరణ లభిస్తోంది. మహిళా సంఘాల సభ్యులు ఉపాధి మార్గాల వైపు దృష్టిపెడుతున్నారు.
నియోజకవర్గ కేంద్రాల్లో
జిల్లాలో మొదలుకానున్న మహిళా పెట్రోల్ బంకులను ముందుగా 5 నియోజకవర్గ కేంద్రాల్లో మొదలుపెట్టనున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, పటాన్ చెరు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలైంది. పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని పాత వెలుగు ఆఫీస్ ఆవరణలో 8 గుంటల ప్రభుత్వ స్థలంలో బంకు ఏర్పాటు చేయనున్నారు. ఈ పెట్రోల్ పంపు పనులు దాదాపు పూర్తి కావడంతో ఈ నెలాఖరున ప్రారంభించి మహిళ సమాఖ్య వారిచే నిర్వహించనున్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. బంకు ఏర్పాటుకు సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఐఓసీఎల్ తో 20 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మిగతా నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 8 గుంటల ప్రభుత్వం భూమిని పెట్రోల్ బంకు కోసం కేటాయించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. రోడ్డు పక్కన రద్దీ ప్రాంతాల్లో చుట్టుపక్కల మరో పెట్రోల్ బంకు లేనిచోట స్థలాన్ని ఎంపిక చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో పనులు షురూ కాగానే ఐఓసీఎల్ తో ఒప్పందం చేసుకోనున్నారు.
ఒక్కో బంకులో 20 మంది
జిల్లాలో ఏర్పాటు చేసే మహిళా పెట్రోల్ బంకుల్లో ఒక్కో బంకులో 15 నుంచి 20 మంది మహిళలు షిఫ్ట్ పద్ధతిలో పనిచేయనున్నారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అవి కొనసాగనున్నాయి. పెట్రోల్ బంక్లో పని చేసేందుకు సమాఖ్య సభ్యులకు ఇప్పటికే శిక్షణ తరగతులు కొనసాగుతుండగా, అవి ఈ నెల 21 (సోమవారం)తో ముగియనున్నాయి. సభ్యులు కనీసం 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులై ఉండి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాసైన వారిని ఎంపిక చేస్తున్నారు. టెన్త్, ఇంటర్పాసైనవారికి పెట్రోల్, డీజిల్, క్యాషియర్ బాధ్యతలు అప్పగిస్తుండగా, డిగ్రీ చదివిన వారితో మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.