బాన్సువాడ, వెలుగు: పురుషులు చేపట్టే అయ్యప్ప దీక్షలో మహిళలదే కీలక పాత్ర అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయం సత్యవాణి పేర్కొన్నారు. బాన్సువాడ లో జరిగిన అయ్యప్ప పడిపూజకు హాజరైన ఆమె భక్తులను ఉద్ధేశించి మాట్లాడారు. మహిళల చేయూత లేనిదే అయ్యప్పలు కఠిన దీక్ష చేయలేరన్నారు. పురుషుడి నుంచి రక్షణ, స్త్రీ నుంచి పోషణ రెండు పరస్పర సహకారముంటేనే ఇది సనాతన ధర్మం అవుతుందన్నారు.
ప్రతి స్త్రీని గౌరవించాలని, స్త్రీలు కూడా తమను గౌరవించేలా మసులుకోవాలన్నారు. చాలా మంది టీవీ సీరియళ్ల మోజులో పడి, తమ కుటుంబాలను కూడా పట్టించుకోవడం లేదన్నారు. తల్లులందరూ తమ పిల్లలకు సనాతన ధర్మం గురించి తెలియజేయాలన్నారు. అయ్యప్ప పుట్టుక వృత్తాంతాన్ని, దీక్షా నియమాలను వివరించారు. కేదార్ నాథ్ ప్రధాన పూజారి శివలింగ స్వామీజీ, గుడ్ మేట్ మహదేవ్ మహరాజ్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భక్తులను ఉద్ధేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు ముదిరెడ్డి విఠల్ రెడ్డి, గురుస్వాములు శంకర్, భాస్కర్, మల్లికార్జున్ , ర్యాల విఠల్ రెడ్డి, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.