కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపు 25 ఏళ్ల తర్వాత ట్రాఫిక్ విధుల్లోకి మహిళా పోలీసులొచ్చారు. ఇటీవల కొత్తగా రిక్రూట్ అయిన వారిలో ఐదుగురిని ట్రాఫిక్ విధుల్లోకి తీసుకున్నారు. వీరిలో బీటెక్, ఎంఎస్సీ కోర్సులు పూర్తిచేసిన వారున్నారు. సర్కారీ కొలువు కోసం కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారు ఇప్పుడు... ట్రాఫిక్ డ్యూటీలు నిర్వహిస్తూ జనానికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సుమారు 2 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా... అందులో కొత్తగా 27 మంది మహిళలు కానిస్టేబుల్స్ గా రిక్రూట్ అయ్యారు. వీరిలో ఐదుగురు ట్రాఫిక్ విధుల్లో చేరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపు 25 ఏళ్ల క్రితం మహిళలు ట్రాఫిక్ పోలీసులుగా విధులు నిర్వహించేవారు. తర్వాత... వారు ఇతర విభాగాల్లో చేరడంతో పురుషులే ఇంతకాలంగా ట్రాఫిక్ డ్యూటీలు చేస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్ ట్రాఫిక్ లో మొత్తం 57మంది పురుషులు ఉంటే.. ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్తో పాటు కొత్తగా వచ్చిన అయిదుగురితో కలిపి 66 మంది విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరిన మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ డ్యూటీలు కేటాయించారు. రద్దీగా ఉండే కరీంనగర్ లోని మెయిన్ జంక్షన్లలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ కానిస్టేబుల్స్. దాదాపు నెల రోజుల క్రితమే వారు విధుల్లో చేరగా.... కొత్త డ్యూటీ తమకు ఎంతో సంతృప్తిగా ఉందంటున్నారు...
ALSO READ | వేతనాలు పెంచాలని అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె
మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తూ.. ట్రాఫిక్ విధులను వీరు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పోలీసు ఉద్యోగం అంటే మహిళలకు కత్తి మీద సాములాంటిది. ముఖ్యంగా ట్రాఫిక్ డ్యూటీ అంటే గంటల కొద్ది నిల్చొని విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అందులోనూ సాదారణ పోలీసులతో పోలిస్తే ట్రాఫిక్ సిబ్బంది విధులు కొంచెం కఠినంగా ఉంటాయి. నెల రోజుల నుంచి కరీంనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నామని... 6 గంటల విధులతో మొదట్లో కొంత కష్టంగా అనిపించినా.. అలవాటైపోయిందని చెబుతున్నారు కానిస్టేబుల్స్. తల్లిదండ్రులు తమను ఎంతో కష్టపడి చదివించారని... వారి కష్టానికి ఫలితం వచ్చేలా ఉద్యోగాలు సాధించామన్నారు. వీరిలో వివాహమైన ఓ మహిళ... తన భర్త ప్రోత్సాహంతో ఈ జాబ్ లోకి వచ్చానని.. ఇంటి బాధ్యతలను భర్త పంచుకుంటుండటంతో తాను ఈ డ్యూటీని సమర్ధవంతంగా చేయగలుతున్నానని చెప్పింది.
నగరంలో చాలా కాలం పాటు సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ జంక్షన్లను ఏర్పాటు చేశారు. స్మితా సబర్వాల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు కరీంనగర్ బస్టాండ్, తెలంగాణ చౌక్, కమాన్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, నాకా చౌరస్తా ప్రాంతాల్లో వాహనాలన్నీ స్లోగా వెళ్లేలా భారీ జంక్షన్లు ఏర్పాటు చేశారు. దీంతో... ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్ లేకుండానే వాహనదారులు మెళ్లిగా వెళ్లేవారు. అయితే గడిచిన పదేళ్లలో జిల్లా కేంద్రంలో వాహనాల సంఖ్య, కార్లు, బైకులు, ఇతర వ్యకిగత వాహనాలు, ఆటోలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల పాతకాలం నాటి సిగ్నల్ ఫ్రీ జంక్షన్ల వద్ద తరుచూ వాహనాలు జామ్ అవుతున్నాయి. దీంతో.. మళ్లీ కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ తీసుకొచ్చారు. రద్దీని కంట్రోలు చేయాలంటే సిగ్నల్స్ దగ్గర పోలీసుల కాపాల తప్పనిసరి అయింది. ఇప్పుడొచ్చిన ఐదుగురు మహిళా కానిస్టేబుల్స్ ప్రధాన జంక్షన్ల వద్ద విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఎక్కువగా బస్టాండ్, ప్రతిమ మల్టీప్లెక్స్, కోర్టు చౌరస్తా, తెలంగాణ చౌక్ ఏరియాల్లో వీరు విధులు నిర్వహిస్తున్నారు.
కరీంనగర్ ట్రాఫిక్ లో నారీశక్తి రంగ ప్రవేశంతో ఇంతకాలం గంటల కొద్దీ విధులు నిర్వహించిన పురుష పోలీసులకు కూడా కొద్దిగా రిలీఫ్ దొరికినట్లైంది. వాహనాలను కంట్రోలు చేస్తూ ఇటు డిపార్ట్ మెంట్ లో మంచి పేరు తెచ్చుకుంటామని చెబుతున్నారు న్యూలీ అపాయింటెడ్ ట్రాఫిక్ ఉమెన్ పోలీస్.