- పెండ్లి అయిన ఆరు నెలలకే ఇంటి నుంచి గెంటేసిన భర్త, అత్తమామలు
- మూడు రోజులుగా అత్తింటి ముందు ధర్నా చేస్తున్న యువతి
కల్లూరు, వెలుగు : తన భర్త తనకు కావాలంటూ ఓ యువతి అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన మాజీ ఎంపీపీ వలసాల జయలక్ష్మి, నరసింహారావుల కుమారుడు మణికిషన్‌కు పెనుబల్లి మండలం యడ్లబంజర్ గ్రామానికి చెందిన జిగిని నరసింహారావు వెంకట్రావమ్మ కూతురు మౌనికకు నాలుగేళ్ల కింద పెండ్లి జరిగింది. వివాహమైన ఆరు నెలల తర్వాత మౌనికను పుట్టింటికి పంపించి, తిరిగి తీసుకురావడం లేదు.
పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతో మౌనిక మూడు రోజుల నుంచి తన మూడేళ్ల కొడుకుతో అత్తగారింటి ముందు ఆందోళన చేస్తోంది. తాను ఏ తప్పు చేయకపోయినా తనను ఇంటి నుంచి గెంటి వేశారని, తనకు న్యాయం చేయాలని వీఎం బంజర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని మౌనిక వాపోయింది. తాను అత్తగారింటికి వెళ్తే తాళం వేసుకొని వెళ్లిపోతున్నారని, తన భర్తను జాబ్ పేరుతో హైదరాబాద్‌లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేసింది. మౌనికకు మద్దతుగా యడ్ల బంజర్ గ్రామానికి చెందిన మహిళలు పెద్దఎత్తున కల్లూరు చేరుకొని మౌనిక అత్తమామల ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కల్లూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి పంపించారు.