- లంచం ఇవ్వలేదనే పేరు తొలగించిన్రు
- డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు రాలేదంటూ కలెక్టరేట్లో మహిళల ఆందోళన
హైదరాబాద్ సిటీ, వెలుగు: డబుల్ బెడ్రూమ్ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న తమకు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారంటూ పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. గురువారం కలెక్టరేట్ లో ముషీరాబాద్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు డబుల్ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కవాడిగూడ ప్రాంత మహిళలు కొందరు తమ పేర్లను తొలగించి అనర్హుల పేర్లను చేర్చారని, ఓ లీడర్అడిగినంత డబ్బు ఇవ్వలేదనే కారణంతో అనర్హుల పేర్లు చేర్చి తమకు అన్యాయం చేశాడని ఆరోపించారు.
అక్కడికి వచ్చిన లీడర్‌ను చుట్టుముట్టి నిలదీశారు. కవాడిగూడకు చెందిన స్వప్న మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానని తమ జాగా తీసుకున్నారని, ఫస్ట్లిస్టులో తన పేరు ఉందని, పట్టాల కోసం వస్తే పేరు మాయమైందని ఆవేదన వ్యక్తం చేసింది.
వంద శాతం పారదర్శకంగా చేశాం
‘ఇండ్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా 100 శాతం పారదర్శకంగా పని చేశాం. బస్తీ సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేశాం. భూమి ఇచ్చిన ఒక్కో కుటుంబానికి ఒక్కో ఇల్లు ఇచ్చాం. ఒకే ఇంట్లో ఉంటున్న రెండు మూడు కుటుంబాల వారు మాత్రమే ఆందోళన చేస్తున్నరు’ అని డీఆర్ఓ వెంకటాచారి వివరణ ఇచ్చారు.