
జహీరాబాద్, వెలుగు : జహీరాబాద్ సమీపంలోని పస్తాపూర్ కేంద్రంగా కొనసాగుతున్న డీడీఎస్ సంస్థలో 30 ఏళ్ల కింద పనిచేసి విరమించుకున్న మహిళలు తాము జమ చేసిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం డీడీఎస్ ఆఫీసు ముందు నిరసన తెలిపారు. అప్పట్లో తమ సంఘం పేరుతో ఉన్న భూముల్లో వాటా కూడా ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా డీడీఎస్ డైరెక్టర్ రుక్మిణి రావు మహిళల వద్దకు వచ్చి వారి నుంచి వినతి పత్రం స్వీకరించారు.
అనంతరం మాట్లాడుతూ డీడీఎస్ సంస్థను వదిలి వెళ్లిన మహిళల డబ్బులు తిరిగి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అప్పట్లో వారు సంస్థలో తీసుకున్న అప్పులను కూడా తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. 30 ఏళ్ల కింద సంస్థను వదిలి వెళ్లిన మోసగాళ్ల మాటలు వినకుండా నేరుగా డీడీఎస్ ఆఫీసుకు వచ్చి మీకు రావలసిన డబ్బులు లెక్క చూసుకొని తీసుకెళ్లాలని సూచించారు.
డీడీఎస్ సంస్థ ఎక్కడికి పోలేదని ఈ సంస్థకు దేశ విదేశాలలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయన్నారు. అలాంటి సంస్థపై గతంలో సంస్థలో పనిచేసిన కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.