డబుల్ బెడ్​రూం ఇండ్ల పంపిణీలో కలెక్టర్ న్యాయం చేయడం లేదు

యాదాద్రి, వెలుగు : డబుల్ బెడ్​రూం ఇండ్ల పంపిణీలో కలెక్టర్ న్యాయం చేయడం లేదని ఆలేరు టౌన్​కు చెందిన పలువురు మహిళలు ఆరోపించారు. ఇండ్లు ఇప్పించాలని భువనగిరిలోని యాదాద్రి కలెక్టరేట్​ఎదుట సోమవారం పెట్రోల్ ​బాటిళ్లతో నిరసన తెలిపారు. ఆలేరు మున్సిపాలిటీలో ఇటీవల 64 డబుల్​బెడ్​రూం ఇండ్ల పంపిణీ జరిగింది. ఇందులో అర్హులైన తమకు అన్యాయం చేసి, బీఆర్ఎస్​ లీడర్లు ఇండ్లు తీసుకున్నారని ఆరోపిస్తూ కౌన్సిలర్ శమంతకరెడ్డితో కలిసి పలువురు మహిళలు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్​వద్ద ఉన్న ధర్నా చౌక్​కు పెట్రోల్​ బాటిళ్లతో వచ్చి కూర్చున్నారు. ఇండ్లు ఇప్పించాలని కలెక్టర్​ను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. పెట్రోల్ ​బాటిళ్లతోనే కలెక్టరేట్​లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మెట్లపైనే బైఠాయించారు. తర్వాత వారిని బయటకు పంపించేశారు. తమకు న్యాయం జరిగేంతవరకు పోరాడతామని మహిళలు స్పష్టం చేశారు.