- కాంగ్రెస్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌లో ఆందోళన
- తహసీల్దార్ ఆఫీసు ముట్టడి
సుల్తానాబాద్, వెలుగు : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వందలాది మంది మహిళలు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు తహసీల్దార్ఆఫీసును శుక్రవారం ముట్టడించారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎలిగేడు మండలంలోని12 గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకొని ఆందోళన చేశారు. వివిధ గ్రామాల నుంచి ఆటోలు, ఇతర వాహనాల్లో సుమారు వెయ్యి మంది వరకు తరలివచ్చి ఎలిగేడు జడ్పీ హైస్కూల్ చౌరస్తా నుంచి తహసీల్దార్ ఆఫీసు వరకు ర్యాలీ తీశారు. తర్వాత తహసీల్దార్ఆఫీసు ముందు దాదాపు రెండు గంటల పాటు బైఠాయించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కారు డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పిందని, అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు అవుతున్నా తమకు ఇండ్లివ్వలేదన్నారు. దీంతో తాము గుడిసెల్లో , అద్దె, రేకుల ఇండ్లల్లో దుర్భర జీవితం గడుపుతున్నామన్నారు. 1100 అప్లికేషన్లను ఆఫీసర్లకు అందజేసి వెళ్లిపోయారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు.
విజయ రమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వైఫల్యానికి ఇదే నిదర్శనమన్నారు. పార్టీ లీడర్లు రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, సంతోష్ రావు, సుధాకర్ రెడ్డి, ప్రకాష్ రావు, అన్నయ్య గౌడ్, సాయిరి మహేందర్, సారయ్య గౌడ్ పాల్గొన్నారు.