దామోదర​ రాజనర్సింహను నిలదీసిన మహిళలు 

సంగారెడ్డి (మునిపల్లి), వెలుగు : కాంగ్రెస్ హయాంలో కట్టుకున్న ఇండ్లకు ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను బాధిత మహిళలు నిలదీశారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట, బుసారెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన పలువురు బీఆర్ఎస్  నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమంలో అక్కడకు వెళ్లిన ఆయనను మహిళలు నిలదీశారు. ‘‘ఎన్నికలు వస్తేనే మేము గుర్తొస్తమా? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లారు? మమ్మల్ని పట్టించుకునే వారే లేకుండా పోయారు.

ALSO READ :కాళోజీ కుమారుడి కన్నుమూత

కాంగ్రెస్​ హయాంలో కట్టిన ఇండ్లకు అప్పుడు మీరు (దామోదర) ఎమ్మెల్యేగా ఉండి బిల్లులు ఇప్పించలేకపోయారు” అని వారు మండిపడ్డారు. రాజనర్సింహ స్పందిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్  పార్టీ అధికారంలో లేనందున ఏం చేయలేకపోతున్నామని బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన బుసారెడ్డిపల్లి వెళ్లగా అక్కడ కూడా ఆయనకు నిరసన ఎదురైంది. తమ గ్రామానికి ఎందుకు రావడం లేదని స్థానికులు నిలదీశారు. దాంతో   చేసేదేమీ లేక అక్కడున్న పార్టీ కార్యకర్తలతో ఆయన కాసేపు మాట్లాడి  వెళ్లిపోయారు.