- గతంలో ఒకరు మూడు సార్లు, మరొకరు రెండు సార్లు గెలుపు
- ఈ ఎన్నికల 35 మంది బరిలో ఉన్నా ఒక్క మహిళా అభ్యర్థి కూడా లేరు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మహిళలు కేవలం ఓటర్లుగానే మిగులుతున్నారు. మొత్తం ఓటర్లలో లేడీస్ సంఖ్యే ఎక్కువగా ఉన్నా, చట్ట సభలకు వారి ప్రాతినిధ్యం ఉండడం లేదు. ఈ ఎన్నికల్లో మొత్తం 35 మంది క్యాండిడేట్లు బరిలో ఉండగా, అందులో ఒక్క మహిళా అభ్యర్థి కూడా లేకపోవడం గమనార్హం. ముందుగా నామినేషన్లు వేసిన వారిలో ఒక మహిళా అభ్యర్థి ఉండగా, తర్వాత ఆమె నామినేషన్ ఉపసంహరించుకున్నారు. గతంలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. ఇందులో ఒక మహిళా నేత మూడు సార్లు విజయం సాధించగా, మరొకరు రెండు సార్లు గెలిచారు. ఈ ఇద్దరు కూడా స్థానికేతరులే కావడం గమనార్హం.
ఓటర్లలో మహిళలే ఎక్కువ!
తుది ఓటర్ల జాబితా ప్రకారం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మొత్తం 16,31,039 మంది ఓటర్లున్నారు. అత్యధికంగా ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 3,24,073 మంది, కొత్తగూడెంలో 2,47,494, సత్తుపల్లిలో 2,43,943, పాలేరులో 2,40,806, మధిరలో 2,22,160, వైరాలో 1,93,389 మంది ఓటర్లుండగా, అత్యల్పంగా అశ్వారావుపేటలో 1,59,174 మంది ఓటర్లున్నారు. ఇందులో 8,43,749 మంది మహిళలు, 7,87,160 మంది పురుషులు, 130 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. ఈ తుది ఓటర్ల జాబితాలో పేరున్న వారు మాత్రమే ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం పురుషులతో పోల్చుకుంటే 56,589 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
17 సార్లు ఎన్నికలు.. గెలిచింది ఇద్దరు మహిళలే..!
ఖమ్మంలో 1951 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లో కలిపి 221 మంది పోటీలో నిలిచారు. ఇందులో కేవలం ఏడుగురు మాత్రమే మహిళలు. కాంగ్రెస్ తరఫున తేళ్ల లక్ష్మీకాంతమ్మ మూడు సార్లు విజయం సాధించారు. 1962, 1967, 1972 ఎన్నికల్లో ఆమె గెలిచారు. మరో రెండుసార్లు కాంగ్రెస్ తరఫున గారపాటి రేణుకాచౌదరి విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో గెలిచి, 2019 ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. మరో మహిళా నేత మద్దినేని బేబీ స్వర్ణకుమారి 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున రేణుకాచౌదరిపై పోటీచేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు.
మిగిలిన ఎన్నికల్లో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ఇండిపెండెంట్లుగా చాలా మంది మహిళలు పోటీ చేసినా, వాళ్లెవరూ ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. మొత్తం ఓటర్లలో సగానికి పైగా మహిళలు ఉన్నా, సొంతంగా చట్టసభలకు వెళ్లేందుకు ఆసక్తి చూపించకపోవడం, ప్రధాన పార్టీలు కూడా వారిని ఓటు బ్యాంకుగా చూడడం తప్ప లీడర్లుగా ప్రోత్సహించకపోవడంతో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడం లేదన్న అభిప్రాయాలున్నాయి.