స్కానింగ్​ సెంటర్​పై చర్యలేవీ..?

స్కానింగ్​ సెంటర్​పై చర్యలేవీ..?
  • జడ్పీ మీటింగ్​లో మహిళా ప్రతినిధుల నిలదీత

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ జడ్పీ మీటింగ్ శుక్రవారం దాదన్నగారి విఠల్ రావు అధ్యక్షతన జరగ్గా.. సభ్యులు జిల్లాలో జరుగుతున్న ఘటనలపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.  నగరంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ​లో మహిళల న్యూడ్​ ఫొటోలు, వీడియోలు తీసిన ఉదంతంపై ఆఫీసర్లు సైలెంట్​గా ఉండడం ఏమిటని మహిళా ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. ఎక్కడా బయటకు చెప్పుకోలేని రీతిలో మహిళలను అవమానపర్చిన ఘటనను సీరియస్​గా తీసుకోకపోవడానికి కారణమేందని ఇందల్వాయి జడ్పీటీసీ గడ్డం సుమనారెడ్డి డీఎంహెచ్​వో తుకారాం రాథోడ్​ను నిలదీశారు. 

స్కానింగ్​ సెంటర్​ తీరు మహిళలను అభద్రతలో పడేసిందని వైస్​ ఛైర్​పర్సన్​ రజితాయాదవ్​వాపోయారు. పోలీస్​ శాఖ స్కానింగ్​ సెంటర్​పై పూర్తి విచారణ చేసి కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతుకు నివేదించిందన్నారు. పై అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని డీఎంహెచ్​వో రాథోడ్​ సమాధానం చెప్పారు.  ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి ఈ అంశంపై చర్చను కొనసాగిస్తూ ఆఫీసర్ల ఇండ్లలో ఇలాంటి ఘటనలు జరిగితే ఆ బాధ ఎట్లా ఉంటుందో అర్థమవుతుందన్నారు.  

ప్రొటోకాల్​ పాటించరా..?

మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేల తేడా ఆఫీసర్లకు తెలవదా అని ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్మూర్​ సెగ్మెంట్​లో ప్రొటోకాల్​ పాటించడం లేదని మండిపడ్డారు. చట్టసభకు ఎన్నికైన తనను అవమానించేలా ఆఫీసర్లు వ్యవహరిస్తే ఊరుకోనన్నారు. గుమ్మిరాల నుంచి హైదరాబాద్​ వరకు ఉన్న ఆర్టీసీ బస్​ ఫెసిలిటీని ఎందుకు తొలగించారని కమ్మర్​పల్లి జడ్పీటీసీ మెంబర్ రాధాగౌడ్​ మండలం లోకల్​ బాడీ లీడర్లు ప్రశ్నించారు. 

బీఆర్​ఎస్​ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్​రెడ్డి నిర్వహణలోని షాపింగ్​ మాల్​ బకాయిలు రూ.7 కోట్లు ఆర్టీసీకి చెల్లించేలా చేశామని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తెలిపారు.  బెజ్జోరా ఇసుక రవాణా ఆపాలని, బీఆర్​ఎస్​ గవర్నమెంట్​ హయాంలో  నిలిచిపోయిన రోడ్​ నిర్మాణాలు పూర్తి చేయాలని, మిషన్​ భగీరథను సక్సెస్​ఫుల్​గా నడుపాలని సభ్యులు సూచించారు.