దేశంలో 30 ఏండ్లుగా మహిళా బిల్లుపై చర్చ సాగుతోంది. ఆలస్యమైనా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభలో పెట్టడం, రాజకీయ పార్టీలు మాటవరుసకైనా కలిసొస్తామని చెప్పడాన్ని ఆహ్వానించవచ్చు. రెండు రకాలుగా మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. మొట్టమొదటిది సమాజంలో సగభాగం మహిళలు. సంప్రదాయ సమాజంలో మహిళలు వంటింటికే పరిమితమయ్యారు. ఆడపిల్లలకు విద్య, ఉపాధి, వృత్తుల్లో అవకాశాలు పెరుగుతున్న మాట వాస్తవమే కానీ.. విధాన నిర్ణయం, నాయకత్వ స్థాయికి వాళ్లు ఇంకా చేరుకోలేదు.
సమాజంలో సగభాగమైన మహిళలకు చట్ట నిర్మాణంలో, విధానాల్లో, ప్రభుత్వంలో పాత్ర తగిన స్థాయిలో లేకపోతే అది ప్రజాస్వామ్యం కాజాలదు. రెండోది మనదేశంలో మగవారు అధికారాన్ని పెత్తనంగా భావిస్తున్నారు. ఒక ఫ్యూడల్సమాజం నుంచి మనం వస్తున్నాం కాబట్టి అధికారం అంటే పెత్తందారీ స్వభావంగా చూస్తున్నాం. అందుకే ఏ పదవులంటే మనకు ఇష్టం అంటే.. రెవెన్యూ అంటే ఇష్టం.. ఎందుకంటే భూమి మీద, కలెక్టర్ల మీద పెత్తనం ఉంటుంది. ఆర్థిక శాఖ అంటే ఇష్టం.. డబ్బు మీద పెత్తనం ఉంటుంది కాబట్టి, హోంశాఖ అంటే ఇష్టం.. పోలీసుల మీద పెత్తనం ఉంటుంది కాబట్టి, అంటే కర్రపెత్తనం చెలాయించే శాఖలు కావాలి అంతేగానీ.. మంచి విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, వరద, మురుగు నీటి నిర్వహణ.. ఇవి పెద్దగా గ్లామర్ఉన్న శాఖలుగా ఇప్పుడు వీళ్లు భావించడం లేదు. అధికారాన్ని కొంతమంది పెత్తందారీ స్వభావంగా చిత్రీకరించాం. మగవారిలా కాకుండా రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం తీసుకుంటే అధికారాన్ని వారు పెత్తనంగా కాకుండా సేవగా మార్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
కొత్త సీసాలో పాత నీరు
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త సీసాలో పాత నీరుగా ఉంది. 30 ఏండ్లుగా ఏవైతే లోపభూయిష్ట నమూనాలు వచ్చాయో.. ఇప్పుడూ అదే తెచ్చారు. మహిళలకు సీటు రిజర్వ్ చేయడంలో ఇది వరకు అయిదేండ్లకోసారి అన్నారు, ఇప్పుడు ప్రతి జనాభా లెక్కలతో అంటే.. ప్రతి పదేండ్లకు అంటున్నారు. రెండు ఎలక్షన్లకు ఒకసారి రొటేషన్ జరుగుతుంది. దీని వల్ల సమస్య అలాగే ఉంటుంది. ప్రోక్సీ నాయకత్వం వస్తుంది. ‘నా సీటు పోయినట్టయితే.. నా కుటుంబంలోనే ఒక మహిళకు ఇచ్చేస్తా’ అనే విధానం వస్తుంది. మనం ఇప్పుడు పంచాయతీ, మున్సిపాలిటీల్లో చూస్తుంటాం. పేరుకు మహిళ సర్పంచ్‌గా ఉంటుంది కానీ పెత్తనం చేసేదంతా ఆమె భర్త. దీనివల్ల మహిళల నాయకత్వం పెరగదు. సహజ నాయకత్వం రాదు. మొక్కుబడిగా సీటులో మహిళ కనిపిస్తున్నది కానీ.. నిజమైన అధికారం రావట్లేదు.
మహిళలు బాగా పనిచేసినా కూడా.. పదేండ్ల తర్వాత ఏమవుతుంది? రొటేషన్‌లో వచ్చే ఎన్నికల్లో అవకాశం లేకుంటే.. వాళ్లను పెద్దగా పట్టించుకోరు, మంచి నాయకత్వం కనుమరుగవుతుంది. కాబట్టి ఇది లోపభూయిష్టమైన మోడల్. దీనకంటే తేలికైన నమూనా ఉంది. రొటేషన్‌లో మరోచోట మహిళలకు అవకాశం దక్కుతుంది కదా? అనే ప్రశ్న రావొచ్చు. అయితే లాటరీలా వచ్చిన ఆ రొటేషన్ విధానంలో.. మహిళలకు సీటు ఇవ్వాలి కాబట్టి వారి కుటుంబంలోని మహిళలకు ఇస్తారు. మళ్లీ అక్కడ మగవారిదే పెత్తనం ఉంటుంది. సీటు రిజర్వ్ చేయాలి కాబట్టి.. ఎవరో ఒక మహిళను తీసుకువచ్చి పెడితే.. ఆమె రాణించలేకపోవచ్చు. ఒకవేళ రాణించినా.. రొటేషన్‌లో ఆమె ఎక్కువ కాలం నాయకురాలిగా కొనసాగలేకపోతారు. దాంతో నిజమైన నాయకత్వం పెరగదు.
ఒక కమిటీ అవసరం
ప్రస్తుతం మహిళా బిల్లు అమోదం పొందడానికి ముందు రాజ్యాంగ సవరణ జరగాలి. రెండు సభల్లోనూ మూడింట రెండొతుల మెజారిటీ కావాలి. 15 రాష్ట్ర శాసనసభల్లో ఒప్పుకుంటేనే అది చట్టంగా మారుతుంది. కేంద్రం డీలిమిటేషన్‌కు దానికి లింక్ పెడుతున్నది కాబట్టి దాని అమలు కోసం ఏండ్ల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. అలా కాకుండా నేను చెప్పినట్టు.. రాజకీయ పార్టీలు 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించేలా సింపుల్‌గా చట్టం చేస్తే.. వచ్చే ఎన్నికల్లోనే మహిళలకు రిజర్వేషన్ అమలవుతుంది. ఈ నమూనా 1998లోనే మేము తయారు చేశాం. అప్పుడు బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. ఆయన వెయ్యి కాపీలు తీసుకొని ఎంపీలందరికీ పంచిపెట్టి, అప్పటి ప్రధానికి ఇచ్చి అప్పుడు ఆ బిల్లును ఆపించారు. అది జరిగి 25 ఏండ్లు అయినా.. మళ్లీ పాత నమూనాలతోనే వస్తే.. ఏదో గుడ్డెద్దు చేలో పడినట్లు ఉంటుంది తప్ప మహిళల నాయకత్వం పెరగదు.
ప్రస్తుత రాజ్యాంగ సవరణ సహా రిజర్వేషన్ బిల్లుకు మూడింట రెండొంతుల మెజార్టీ అధికార పక్షానికి రెండు సభల్లోనూ లేదు. అన్ని పార్టీలు కలిసొస్తే తప్ప.. చట్టం సాధ్యం కాదు. రాష్ట్రాల శాసనసభల్లోనూ అంత తేలిగ్గా ఆమోదం లభించకపోవచ్చు. కాబట్టి ఒక కమిటీ నేతృత్వంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు రొటేషన్ లేకుండా కృత్రిమ నాయకత్వం రాకుండా ఎలాంటి విధానాలు తీసుకురావాలనే అంశంపై చర్చ, అధ్యయనం జరగాలి. అనుభవం నుంచి పాఠాలు నేర్చుకొని ఒక మంచి విధానం తీసుకువచ్చి రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా..
చట్టం తీసుకువస్తే వెంటనే అమలు చేయవచ్చు.
పార్టీలే మహిళా రిజర్వేషన్ అమలు చేయొచ్చు
అందుకే రొటేషన్పద్ధతి, శాశ్వతంగా సీట్లు రిజర్వ్ చేయడం కాకుండా.. ఒక తేలికైన నమూనా ఉంది. 1952 నుంచి గత 71 ఏండ్లుగా దేశంలో, రాష్ట్రాల్లో గానీ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల్లో మగవాళ్లలో నూటికి 25 మంది ఎన్నికవుతున్నారు. కానీ ఆడవాళ్లలో నూటికి 30 మంది ఎన్నికవుతున్నారు. అంటే మన ఓటర్లు మహిళల నాయకత్వానికి వ్యతిరేకం కాదు. పార్టీలు మహిళలను తగిన స్థాయిలో పెంచడం లేదు. అందుకే రాజ్యాంగ సవరణ లాంటి ఆర్బాటం లేకుండా సింపుల్ చట్టం ఒకటి తీసుకురావాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ విధిగా మూడో వంతు సీట్లలో మహిళలనే నిలబెట్టాలని చట్టం చేయాలి. ఎక్కడ నిలబెట్టాలనేది ఆయా పార్టీల ఇష్టం. గెలుపు గ్యారంటీగా మహిళలకు వస్తుంది. ఒకసారి గెలిచాక.. మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు సహజ నాయకత్వం వస్తుంది. పార్టీలు కూడా మహిళలకు అన్యాయం చేయకుండా ఉండొద్దంటే.. ఒక రాష్ట్రాన్ని లోక్‌సభ యూనిట్‌గా చేయాలి. ఉదాహరణకు తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి.. కాబట్టి విధిగా ఆరు స్థానాల్లో చేయాలి.
ఏపీలో 25 సీట్లు ఉన్నాయి.. విధిగా 8 లేదా 9 స్థానాలు చేసేలా నిబంధన పెట్టాలి. బలహీనంగా ఉండే రాష్ట్రంలో ఆడవాళ్లను పెట్టి, బలంగా ఉండే రాష్ట్రాల్లో మగవారిని పెట్టే అవకాశం లేకుండా చేయాలి. అలాగే శాసనసభ విషయంలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా తీసుకోవాలి. అప్పుడు 21 స్థానాల్లో 7 స్థానాలను విధిగా మహిళలకు కేటాయించాలి. దీనివల్ల కచ్చితంగా తగిన సంఖ్యలో మహిళా నాయకులు ఎదుగుతారు. రొటేషన్ అవసరం రాదు, కృత్రిమ నాయకత్వం ఉండదు. రాజకీయం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు సహజంగానే డబ్బు, పరపతి సహా అన్ని రకాలుగా బలంగా ఉన్న వారికే రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పిస్తున్నాయి. అభ్యర్థి మంచి చెడ్డలు చూడటం లేదు. అందుకే కచ్చితంగా మౌలికపరమైన రాజకీయ సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు కావాలి. రాజకీయ పార్టీల నిర్మాణంలో, వ్యక్తి నియంతృత్వ, వ్యక్తి స్వామ్యంలో మార్పులు రావాలి. గత 30 ఏండ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగడానికి కారణం.. బీసీ రిజర్వేషన్లను పార్టీలు కారణంగా చూపుతూ వచ్చాయి. రాజకీయ పార్టీలు బీసీలు ఎక్కడ బలంగా ఉన్నారో అక్కడ వాళ్లకు కేటాయించి సమన్యాయం చేయాలి. అప్పుడు రిజర్వేషన్ల గొడవ ఉండదు.
మహిళలు సేవగా చూస్తారు
మహిళలు సహజంగానే ఇంట్లో పిల్లల ఆలనా పాలనా చూస్తారు. కుటుంబ ఆరోగ్యం, అవసరాలు, భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. కానీ మగవారు పెత్తనం, అధికారం చెలాయించే పరిస్థితే ఎక్కువ ఉంటుంది. ఇంట్లో ఉన్నట్లే.. మగవారు రాజకీయాల్లో కూడా పెత్తనం ఉన్న శాఖలపైనే మక్కువ చూపుతారు. పోలీసులపై(హోంమంత్రి) ఎవరికి పెత్తనం ఉంటే.. వారు గొప్ప, భూమి, రెవెన్యూ మీద ఎవరి పెత్తనం ఉంటే.. వారు గొప్ప మంత్రి, కలెక్టర్లను ఎవరు శాసిస్తే.. వారు గొప్ప మినిస్టర్.. మిగతా శాఖలన్నీ పనికిరానివనే స్వభావం ఇప్పుడు కనిపిస్తున్నది. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే.. ప్రజల సౌకర్యాలను పెంచేది, సేవలను బాగా అందించేది, పిల్లల భవిష్యత్బాగు చేసే వాటిపై దృష్టి పెరుగుతుంది.
-డా. జయప్రకాశ్ నారాయణ, లోక్ సత్తా వ్యవస్థాపన అధ్యక్షుడు