పునరావాస కేంద్రాల్లో మహిళల హక్కులు రక్షించాలె

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు వద్ద గల ప్రజ్వల కేంద్రం నుంచి ఇటీవల కొంత మంది మహిళలు ఒక్కసారిగా గేటు తాళాలు పగులగొట్టి సెక్యూరిటీని దాటుకొని రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగారు. తమను అక్కడ అండమాన్ జైలు తరహాలో నిర్బంధించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్​చేశారు. జైలులో ఉన్న ఖైదీలను కలుసుకోవడానికి ములాఖత్ పేరుతో కుటుంబ సభ్యులకు, బంధువులకు అవకాశం కల్పిస్తుంటారు, మా విషయంలో కుటుంబ సభ్యులను, ఇతరులను కలుసుకోవడానికి, కనీసం ఇంట్లో వాళ్లు చనిపోయినా ఫోన్​లో మాట్లాడేందుకు కూడా ఏమాత్రం అవకాశం కల్పించడం లేదని వాపోయారు. మానవహక్కులను ఉల్లంఘిస్తూ తమను నిర్బంధిస్తున్నారని వాళ్లు నిరసన తెలిపారు. స్థానిక పోలీసులతోపాటు, పక్క పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన కానిస్టేబుల్స్​ ఆ ప్రాంతంలోని కొంతమంది యువకుల మద్దతుతో మళ్లీ ఆ మహిళలను యదాతథంగా ఆ ప్రజ్వల కేంద్రంలోకి పంపించేశారు.

ప్రజ్వల, ఉజ్వల కేంద్రాలేమిటంటే..

వేశ్య గృహాలు, హోటళ్లలో వ్యభిచారం చేస్తూ పట్టుబడుతున్న మహిళలను, యువతులను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానాల్లో హాజరు పరుస్తున్నారు. అప్పుడు న్యాయమూర్తులు వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా లబ్ధిపొందడానికి లేదా శిక్షణ పొందడానికి అందుబాటులో ఉన్న ఉజ్వల, ప్రజ్వల కేంద్రాలకు తరలించాలని సూచిస్తున్నారు. కేంద్ర మాతా శిశుసంరక్షణశాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉజ్వల, ప్రజ్వల కేంద్రాలు నడుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈ కేంద్రాలు వందకు పైగా ఉన్నట్లు అంచనా. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక పట్టణాలు, నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ కేంద్రాలు 500కు పైగా ఉన్నట్లు తెలిసింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ కేంద్రాలను కస్టోడియన్ సెంటర్లు అని చెప్పొచ్చు. న్యాయస్థానాలు కొంత మంది మహిళలకు పదిహేను రోజులు, మరి కొంతమందికి, నెలరోజులు పునరావాసం, ప్రత్యామ్నాయ మార్గం పేరుతో శిక్ష వేస్తూ సెంటర్లకు అప్పగిస్తోంది. కొన్ని సందర్భాల్లో కొన్ని న్యాయస్థానాలు వేశ్యగృహాలు లేదా ఇతరత్రా వాటిల్లో పట్టుబడిన వేశ్యలకు, విటులకు రెండు రోజులు, మూడు రోజులు జైలు శిక్ష విధించడం లేదా కొంత పెనాల్టీ విధిస్తున్నాయి. నేరుగా శిక్షలు, పెనాల్టీలు అనేవి లేకుండా మానసిక పరివర్తనతోపాటు వీరు ఈ వృత్తి నుంచి బయటపడి స్వయం ఉపాధి పొందాలని కోర్టులు ఈ మధ్యకాలంలో వారిని ప్రజ్వల, ఉజ్వల కేంద్రాలకు పంపుతున్నాయి. 

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..

పునరావాస కేంద్రాల్లో మహిళలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపడం ఎలా ఉన్నా.. నెలల తరబడి వారిని నిర్బంధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘వ్యభిచార గృహాలను నిర్వహించే వారిని అరెస్ట్ చేయాలి. వేశ్యలను, విటులను అరెస్ట్ చేయకూడదు’ అని ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మొన్నటి ఆమనగల్లు మహిళల ఆందోళనతో కొన్ని విషయాలు బయటకొచ్చాయి. పునరావాస కేంద్రంలో మగ్గుతున్న మహిళల్లో చాలా మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. వారి తరఫున కోర్టుల్లో పిటిషన్​వేయడానికి కూడా ఎవరూ లేకపోవడంతో వాళ్లు ఏండ్ల తరబడి అక్కడే ఉండాల్సి వస్తోంది. సొంతవారు లేక పునరావాస కేంద్రాల్లో మగ్గిపోతున్న వారి హక్కుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పునరావాస కేంద్రాల ముసుగులో మాఫియాలు పనిచేస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 2012లో హైదరాబాద్​లో ఉన్న ఓ పునరావాస కేంద్రం మీద రాత్రిపూట కొందరు  దాడిచేసి మహిళలను తీసుకెళ్లారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరావాస కేంద్రాల నిర్వహణను పూర్తి స్థాయిలో పరిశీలించాలి. ఏండ్ల తరబడి అందులో మగ్గుతున్న మహిళలకు విముక్తి 
కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కె.ధనలక్ష్మి