- ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు మహిళలే..
- ముగ్గురు కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు కూడా..
- గ్రేటర్ మేయర్, కమిషనర్ మగువలే..
- ప్రస్తుతం వరంగల్ ఎంపీగా కడియం కావ్య
వరంగల్, వెలుగు: కాకతీయుల పాలనలో రాణీ రుద్రమదేవి కీలకంగా వ్యవహరించినట్లు చెబుతుండగా, ప్రస్తుత ఓరుగల్లులో రాజకీయంగా, ప్రభుత్వ అధికారులుగా కీలక పదవుల్లో మహిళలే రాజ్యమేలుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. పల్లె నుంచి పట్నం వరకు మహిళమణులే నేతలుగా వ్యవహరిస్తున్నారు. గతానికి భిన్నంగా ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల నుంచి మగువలే ప్రస్తుత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నారు.
జిల్లా నుంచి ఇద్దరు మహిళా మంత్రులు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍లో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎప్పుడు లేనివిధంగా ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులుగా ఇద్దరు మహిళలకే అవకాశం వచ్చింది. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం, మంత్రులుగా వ్యవహరించారు. రెండో టర్ములో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‍కు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, ఎర్రబెల్లి దయాకర్‍రావుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓరుగల్లు నుంచి ఇద్దరికి మంత్రి పదవులు రాగా, పంచాయతీరాజ్ మంత్రిగా సీతక్క, దేవాదాయ, అటవీశాఖ మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. ఇద్దరు మహిళలకే మినిస్టర్లుగా అవకాశం దక్కింది.
గ్రేటర్ లో మేయర్, డిప్యూటీ, కమిషనర్..
గ్రేటర్ వరంగల్ పరిధిలో కీలకంగా భావించే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్‍గా గుండు సుధారాణి వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ మేయర్‍గా రిజ్వానా షమీమ్ ఉన్నారు. గ్రేటర్ కమిషనర్‍గా సైతం అశ్విని తానాజీ వాఖడే కీలక బాధ్యతల్లో ఉన్నారు.
ఆరింటిలో నలుగురు జడ్పీ చైర్‍పర్సన్లు..
రాజకీయంగా చూస్తే ఓరుగల్లులో ఆరుగురు జడ్పీచైర్మన్లు ఉండగా, నాలుగుచోట్ల మహిళలే ఉన్నారు. వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జడ్పీ చైర్‍పర్సన్లుగా గండ్ర జ్యోతి, అంగోతు బిందు, జక్కు శ్రీహర్షిణి ముగ్గురు మహిళలే ఉన్నారు. ములుగులో జడ్పీ చైర్మన్ జగదీశ్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన స్థానంలో బడె నాగజ్యోతికి జడ్పీ చైర్‍పర్సన్‍గా అవకాశమొచ్చింది. పాలకుర్తి నుంచి మొన్నటివరకు మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‍రావుపై మామిడాల యశస్వినిరెడ్డి ఎమ్మెల్యే గెలిచి రాజకీయంగా సత్తా చాటారు.
సగం మంది కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు..
ఓరుగల్లులో ప్రజాప్రతినిధులుగా, రాజకీయ పదవుల్లో మహిళలే ఉండగా, సగం జిల్లాలకు కలెక్టర్లుగా మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వరంగల్ కలెక్టర్‍గా గతంలో గ్రేటర్ కమిషనర్‍గా వ్యవహరించిన ప్రావీణ్య ఉండగా, హనుమకొండ, ములుగు కలెక్టర్లుగా సిక్తా పట్నాయక్, ఇలా త్రిపాఠి ఉన్నారు. వరంగల్ అడిషనల్ కలెక్టర్లుగా రాధిక గుప్తా, సంధ్యారాణి వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్‍గా జె.శ్రీలత పనిచేస్తున్నారు. ఓరుగల్లు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‍గా రామల సునీత ఉన్నారు.
వరంగల్ మహిళా ఎంపీగా 40 ఏండ్ల తర్వాత కావ్య..
వరంగల్ లోక్‍సభ స్థానం నుంచి రాజకీయాల్లో సీనియర్లు ఆరూరి రమేశ్, మారేపల్లి సుధీర్కుమార్పై కడియం కావ్య మొదటిసారి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. మహబూబాబాద్ స్థానంలో నిన్నటి వరకు మహిళా ఎంపీగా మాలోతు కవిత ఉండగా, ఆమె ఓటమితో మహిళా కోటాలో ఆ స్థానాన్ని కావ్య భర్తీ చేసినట్లయింది. వరంగల్ లోక్‍సభ స్థానంలో మహిళా ఎంపీగా 1994 డాక్టర్ వృత్తిలో ఉన్న కల్పనాదేవి పనిచేయగా, 40 ఏండ్ల తర్వాత డాక్టర్ వృత్తి నుంచి వచ్చిన కడియం కావ్య ఎంపీగా రికార్డు ఖాతాలో వేసుకున్నారు.