![పట్నానికి పోటీగా పల్లెపార్కు](https://static.v6velugu.com/uploads/2021/07/Women-sarpanch-who-developed-the-village-parks-In-Mahabubnagar-District_Ig1cwLXRWa.jpg)
చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో వాకింగ్ ట్రాక్.. సిమెంట్ బెంచీలు.. పిల్లలు ఆడుకునేందుకు గేమింగ్ జోన్.. ఇలాంటివన్నీ సాధారణంగా సిటీల్లో ఉండే పార్కుల్లో కనిపిస్తుంటాయి. కానీ, వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఒక పల్లెటూరులో కూడా ఇలాంటి అందమైన పార్కు ఏర్పాటైంది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కూచూరులో ఉంది ఆ ‘విలేజ్ పార్క్’. దీన్ని డెవలప్ చేసింది ఒక మహిళా సర్పంచ్, సొంత నిధులు కూడా కలిపి ఈ పార్కును తీర్చిదిద్దింది. కలెక్టర్ అభినందనలు అందుకుని, చుట్టుపక్కల ఊళ్లకు ఆదర్శంగా నిలుస్తోన్న ఈ ప్రకృతి వనం (విలేజ్ పార్క్) పై స్పెషల్ స్టోరీ.
గ్రామాల్లోనూ పచ్చదనం కరువవుతున్న ఈ రోజుల్లో ప్రభుత్వం విలేజ్‌పార్క్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా విలేజ్‌పార్క్‌లను డెవలప్ చేస్తోంది. గ్రామంలో మొక్కలు నాటడం, పచ్చదనం కనిపించేలా పార్కుల్ని అభివృద్ధి చేయడం దీని లక్ష్యాలు. అయితే చాలాచోట్ల మొక్కుబడిగానే సాగుతోంది ఈ కార్యక్రమం. కానీ, కూచూరు సర్పంచ్ పిట్టల లక్ష్మమ్మ మాత్రం ‘విలేజ్‌పార్క్’ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలనుకుంది. ఆమె కొడుకు రిటైర్డ్ ఆర్మీ జవాన్ రవి సాయంతో, సొంత నిధులు కూడా ఖర్చు చేసి పార్కును డెవలప్ చేసింది.
గుట్టను తొలిచి
ఊళ్లో రెండెకరాల స్థలంలో పార్క్‌ను ఏర్పాటు చేశారు. దీని కోసం ఊరి పొలిమేరలో ఉన్న చిన్నగుట్టను కూడా తొలిచారు. గుట్ట కింద ఉన్న మొక్కలకు నీళ్లు అందించేందుకు గుట్టపై వాటర్ ట్యాంక్ కట్టారు. వాటర్ ట్యాంక్ ద్వారా టైంకు నీళ్లు అందడంతో మొక్కలు తొందరగానే పెరిగి, పచ్చదనాన్ని అందిస్తున్నాయి. పార్క్‌ను ఏదో సాదాసీదాగా కాకుండా ఆహ్లాదకరంగా, అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. పార్కులో అందరూ కూర్చునేందుకు బెంచీలు, వాకింగ్ ట్రాక్స్, గేమింగ్ జోన్ వంటివి కూడా ఏర్పాటు చేశారు. పార్కుతోపాటు ఊరంతా రోడ్డుకు రెండువైపులా అశోక చెట్లు, టేకు, మల్బరీ, కొబ్బరి, దానిమ్మ, జామ, సపోట వంటి పండ్ల మొక్కలు, రంగురంగుల పూల మొక్కలు కూడా నాటించారు. మొక్కలు బాగా ఎదిగేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో ఊళ్లో ఎక్కడచూసినా పచ్చదనమే కనిపిస్తోంది.
కలెక్టర్ అభినందన
గ్రామంలో విలేజ్‌పార్క్‌ను అందంగా తీర్చిదిద్దిన సర్పంచ్ లక్ష్మమ్మను పాలమూరు కలెక్టర్ వెంకట్రావు అభినందించారు. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం బాగుందని మెచ్చుకున్నారు. మిగతా గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ ఊరి నుంచి దాదాపు 100 మంది దాకా ఆర్మీలో జవాన్లగా చేరారు. దేశసేవలో పాల్గొన్న జవాన్లు కూడా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో సాయపడుతున్నారు. అధికారులు కూడా సహకరిం చడం వల్ల ఇది సాధ్యమైందని సర్పంచ్ చెప్తున్నారు. మహబూబ్ నగర్/నవాబుపేట, వెలుగు
ఆదర్శ గ్రామంగా మార్చుకుంటాం....
గ్రామంలోని అన్ని రోడ్లకు రెండువైపులా, ఇండ్ల దగ్గర మొక్కలను నాటి బ్రతికిస్తున్నాం. పరిశుభ్రత పాటిస్తూ, పల్లె ప్రగతి పనులను పూర్తి చేశాం. త్వరలోనే కూచూరును
ఆదర్శ గ్రామంగా మార్చుకుంటాం. పిట్టల లక్ష్మమ్మ, సర్పంచ్.
ప్రతి మొక్కను బతికించుకుంటాం
సామాజిక బాధ్యతగా ...గ్రామంలో వందలాది చెట్లను నాటించాం. వాటి సంరక్షణ సామాజిక బాధ్యతగా భావిస్తున్నాం. నాటిన ప్రతి మొక్క బతికే విధంగా గ్రామస్తులందరం చర్యలు తీసుకుంటున్నాం. పిట్టల రవి, రిటైర్డ్ ఆర్మీ జవాన్.. కూచూరు