టీఆర్ఎస్ నష్ట నివారణ చర్యలు

బతుకమ్మ చీరలు ఏం బాలేవంటూ తిట్టిన మహిళే... ఈ రోజు జై కేసీఆర్ అంటూ నినదించింది. ఇలాంటి చీరలు మీ ఫ్యామిలీలో ఎవరైనా కట్టుకుంటారా అన్న ఆమె... ఈ రోజు క్షమించమని కోరింది. ఈ ఘటన నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామంలో జరిగింది. దసరా ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టా్త్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలపై ఇప్పటికే పలుప్రాంతాల నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలో బతుకమ్మ చీరల పంపిణీపై, నాణ్యతపై ఆక్రోశంతో ఓ మహిళ నాసిరకం చీరలు ఇచ్చాడంటూ సీఎం  కేసీఆర్ ను నిలదీసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో అక్కడి అధికారులు అలర్ట్ అయ్యారు. 

వెంటనే నష్ట నివారణ చర్యలకు పూనుకున్న అధికార పార్టీ.... బతుకమ్మ చీరలను, సీఎం కేసీఆర్ ను దూషించచిన మహిళ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆమెను వెతుక్కుంటూ వెళ్లి టీఆర్ఎస్ కండువా కప్పి కేసీఆర్ కి జై కొట్టించారు. తనకు కేసీఆర్ అంటే చాలా అభిమానమని ఆ మహిళ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. పెన్షన్, దళిత బంధు విషయంలో కేసీఆర్ తమకు సహకరిస్తున్నాడని తెలిపింది. ఈ సందర్భంలోనే జై కేసీఆర్, తెలంగాణ అంటూ నినాదాలు చేసింది. దీనికి సంబంధించిన ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది.