ISROలో మహిళా సైంటిస్టుల హవా..

ఆకాశంలో సగమే కాదు.. అంతరిక్షమూ మాదే

భారతీయులకు చంద్రుడితో చాలా దగ్గర సంబంధం. పురాణ కాలం నుంచి ఆధునిక జమానా వరకు చంద్రుడు మనకు మేనమామతో సమానం. ఇండియన్​ మహిళలకు తోబుట్టువు. అందుకే ఎన్ని తరాలు గడిచినా చంద్రుడు ‘మామ’గానే కనిపిస్తాడు. అలాంటి సన్నిహితమైన చంద్రుడిపైకి వెళ్లిన మిషన్​–2 బాధ్యతలను మహిళా సైంటిస్టులే పూర్తి చేశారు. చంద్రయాన్​–2 మిషన్​కోసం పనిచేసినవారిలో 30 శాతం మంది ఆడవారే. ప్రాజెక్ట్​ డైరెక్టర్​ మొదలుకొని లాంచింగ్​ సూపర్వైజ్​ వరకు కీ పోస్టుల్లో లేడీ సైంటిస్టులదే కీలక పాత్ర. ఆడవారు పట్టుపట్టారంటే అనుకున్నది సాధించేవరకు వదలరు. మగవారితో పోలిస్తే మేమేం తక్కువ కాదంటున్నారు. అన్ని రంగాల్లోను ముందుకు దూసుకెళ్తున్నారు. టీచింగ్, మెడిసిన్, బ్యాంకింగ్ వంటి కొన్ని రంగాలకే ఆడవారు పరిమితమనే అభిప్రాయం చాలా మందికి ఉంది. అయితే ఇది పూర్తిగా తప్పని నిరూపించింది చంద్రయాన్ –2 టీం.

ఇస్రో మహిళా  సైంటిస్టుల ఆనందం

ఐదేళ్ల కిందట ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ ప్రయోగించినపుడు  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) కంట్రోల్ రూం లో పెద్ద సంఖ్యలో ఉన్న మహిళా సైంటిస్టులు ఆనందంతో కేరింతలు కొట్టిన పిక్  సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటివరకు ఇస్రో వంటి సంస్థల్లో మహిళా సైంటిస్టులు  పెద్దగా వెలుగులోకి రాలేదు. స్పేస్ సైన్స్ అంటే మామూలు విషయం కాదు. సంప్రదాయ పద్ధతిలో చీర కట్టుకున్న ఈ ఇల్లాళ్లు పెద్ద స్పేష్​ మిషన్​ను నడిపించారని తెలిసి ప్రపంచం నివ్వెరపోయింది. ఈ పిక్‌ వైరల్ అయిన తర్వాత  స్పేస్ సైన్స్ లో కూడా ఆడవారు దూసుకుపోతున్న విషయం తొలిసారిగా బయటకు వచ్చింది. అంతేకాదు అనేక మిషన్ లకు  ఆడవారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉండటం చంద్రయాన్ –2 తోనే ప్రారంభం కాలేదు. గతంలో అనేక శాటిలైట్ ప్రోగ్రామ్ లకు ఆడవారు ప్రాజెక్ట్ డైరెక్టర్ లుగా పనిచేశారు.

ప్రాజెక్ట్​ డైరెక్టర్​ వనిత ముత్తయ్య

ఆడవారు కేవలం డెస్క్ టాప్ ఉద్యోగాల్లోనే కాదు స్పేస్ సైన్స్ వంటి రంగాల్లోనూ రాణించగలరని చంద్రయాన్ –2 మిషన్ నిరూపించింది. ఆకాశం కూడా తమకు హద్దు కాదంటున్నారు  లేడీ స్పేస్ సైంటిస్టులు. చంద్రయాన్ –2 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వనిత ముత్తయ్య పనిచేశారు.  అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ప్రతి మిషన్ కు ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు. ఇది చాలా కీలక పోస్టు. లాంచింగ్ కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు మిషన్ లోని వివిధ విభాగాలను కో ఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రాజెక్ట్ డైరెక్టర్ పై ఉంటుంది. మిషన్ మొత్తానికి ఓ టీం లీడర్ గా పనిచేయాల్సి ఉంటుంది. మిషన్ మొదలైనప్పటి నుంచి చంద్రుడి మీద ల్యాండ్ అయ్యేంతవరకు అన్ని కీలక విషయాలు  చూసుకోవాల్సిన బాధ్యత  ప్రాజెక్ట్  డైరెక్టర్ దే.

డిజైనర్ ఇంజనీర్​గా కెరీర్ ప్రారంభం

డిజైనర్ ఇంజనీర్ గా అంతరిక్ష రంగంలోకి  ప్రవేశించిన వనిత తనకున్న కమిట్మెంట్​తో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ అయ్యారు. మిషన్​కి సంబంధించి డేటా హ్యాండిల్ చేయడంలో ఎక్స్ పర్ట్.

మిషన్ డైరెక్టర్​ రీతూ కరిధాల్

చంద్రయాన్ –2 కు మిషన్ డైరెక్టర్​గా రీతూ కరిధాల్ పనిచేస్తున్నారు. స్పేస్ రీసెర్చ్ సర్కిల్స్​లో ‘రాకెట్ ఉమన్ ఆఫ్ ఇండియా’గా ఆమె పాపులర్ అయ్యారు. ‘ఇస్రో’తో అమెది పాత అనుబంధం. 2007లో  ‘ ఇస్రో’లో ఆమె చేరారు. అంతరిక్షానికి సంబంధించిన అనేక మిషన్​లలో పనిచేసిన ఆమె పనిచేశారు. ఇదివరకు మార్స్ ఆర్బిటర్ మిషన్​లో  కూడా రీతూ పనిచేశారు. ఈ మిషన్​లో డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్​గా ఆమె పనిచేశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్​తో పోలిస్తే  మిషన్ డైరెక్టర్ బాధ్యతలు భిన్నంగా ఉంటాయి. మిషన్ ప్రోగ్రెస్ ఎక్కడిదాకా వచ్చిందో  ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టు అవసరమైతే సాంకేతిక మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. రీతూ ఇదివరకు మిషన్ డిజైనర్​గా పనిచేశారు.ఈ అనుభవం మిషన్ డైరెక్టర్​గా బాధ్యతలు నిర్వహించడంలో  ఆమెకు ఎంతగానో ఉపయోగపడుతుంది.


ఎన్. వలరమతి

శాటిలైట్ల లాంచింగ్ పనులను సూపర్ వైజ్ చేస్తారు.  గతంలో రి శాట్–1కు ప్రాజెక్ట్  డైరెక్టర్​గా పనిచేశారు.  ఇన్సాట్ –2ఏ,  ఐఆర్ఎస్ – ఐసీ, ఐఆర్ఎస్ – ఐడీ అండ్ టెక్నాలజీ ఎక్స్​పరిమెంట్ శాటిలైట్  లాంచింగ్​లలో ఆమె కీలక పాత్ర పోషించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవార్డును అందుకున్న తొలి  స్పేస్ సైంటిస్ట్ వలరమతే.

వి.ఆర్.లలితాంబిక

మన దేశం గర్వించదగ్గ మరో ఉమన్ స్పేస్ సైంటిస్ట్ ఈమె. కేరళకు చెందిన లలితాంబిక కంట్రోల్ ఇంజనీరింగ్​లో ఎం. టెక్ చేశారు. తర్వాత ఇస్రోలో  చేరారు. ఇస్రోలో సైంటిస్ట్​గా పనిచేస్తూనే పీహెచ్​డీ పూర్తి చేశారు. అనేక స్పేస్ ఫ్లయిట్ మిషన్​లలో ఆమె భాగస్వాములయ్యారు.  ‘అడ్వాన్స్ డ్  లాంచర్  టెక్నాలజీ’కి సంబంధించి స్పెషలిస్టుగా ఇస్రో వర్గాల్లో ఆమె పేరు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం గగన్ యాన్ మిషన్​లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మౌమితా దత్తా

కోల్​కతాకు చెందిన దత్తా ఎం. టెక్ చదివారు. 2006లో అహ్మదాబాదులోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్​లో చేరారు. అప్పటి నుంచి అనేక ఇంపార్టెంట్ ప్రాజెక్టుల్లో పనిచేశారు. మార్స్ ఆర్బిటర్ మిషన్​కి ప్రాజెక్ట్ డైరెక్టర్​గా పనిచేసి అందరి అభినందనలు అందుకున్నారు. పే లోడ్​ను డెవలప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ‘స్పేస్ అప్లికేషన్స్ సెంటర్’లో ‘మేక్ ఇన్ ఇండియా’కు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు.

నందిని హరినాథ్

నందినికూడా బాల్యం నుంచే అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆమె తల్లి లెక్కల టీచర్. తండ్రి ఇంజనీర్. చదువు పూర్తయ్యాక  ఇస్రోలో చేరారు నందిని.  చిన్న చిన్న ఉద్యోగాల్లో  టాలెంట్ నిరూపించుకుంటూ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్ స్థాయి వరకు వెళ్లారు. ఇండియా సత్తా చాటిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’లో డిప్యూటీ  ఆపరేషన్స్  డైరెక్టర్​గా పనిచేశారు. మార్స్ మిషన్​లో పనిచేయడాన్ని ఎంతో  గర్వంగా ఫీలవుతానన్నారు. అలాగే మంగళ్​యాన్ ప్రయోగంలో కూడా ఆమె పనిచేశారు.

మినాల్ రోహిత్

మార్స్ మిషన్​కి ప్రాజెక్ట్ డైరెక్టర్​గా పనిచేశారు.  ప్రస్తుతం ఇస్రోలో సిస్టమ్స్ ఇంజనీర్​గా పనిచేస్తున్నారు. మంగళ్​యాన్ ప్రాజెక్ట్​ని సక్సెస్ చేయడంలో ఆమె మేజర్ రోల్ పోషించారు. మినాల్​కు చిన్నప్పుడు డాక్టర్ కావాలన్న కోరిక ఉండేది. అహ్మదాబాదులోని నిర్మా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి  ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్​లో గోల్డ్ మెడల్ కూడా కొట్టారు. తర్వాత ఇస్రోలో  శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్ గా ప్రవేశించారు.

సీతా సోమసుందరం

మద్రాస్ ఐఐటీలో ఎమ్మెస్సీ చదివారు సీత. తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఫిజిక్స్​లో  పీహెచ్​డీ చేశారు. తర్వాత ఇస్రోలో చేరారు.  స్పేస్ సైన్స్ ఇనస్ట్రమెంటేషన్ ఎక్స్​పర్ట్​గా సీతా సోమసుందరం పేరు తెచ్చుకున్నారు. ప్రోగ్రామ్  డైరెక్టర్​గా అనేక మిషన్​లకు సేవలందించారు. ‘మంగళ్​యాన్’ ప్రాజెక్ట్​లో పనిచేశారు. ‘పే లోడ్ క్యారక్టరైజేషన్ అండ్ కాలిబరేషన్’ విభాగంలో పనిచేశారు.

టీకే అనూరాధ

స్పేస్ సైంటిస్టుల క్రియేటివిటీకి  ఆకాశం కూడా హద్దు కాదంటారు అనూరాధ. తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడే  ఆమె అంతరిక్ష పరిశోధనలపై  ఆసక్తి పెంచుకున్నారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలుపెట్టడం వంటి విషయాలు ఇంట్లో పెద్ద వాళ్లు  చెబుతుంటే ఆసక్తిగా వినేదాన్నని ఆమె చెప్పారు. ఈ నేపధ్యంలో కన్నడంలో ఓ చిన్న కవిత కూడా రాశానని అనూరాధ చిన్నప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు.  చాలా మంది ఉమెన్ స్పేస్ సైంటిస్టులు ఈమెను ఒక రోల్ మోడల్​గా భావిస్తుంటారు. జియో శాటిలైట్ల లాంచింగ్​లో ఎక్స్​పర్ట్​గా అనూరాధకు మంచి పేరుంది. యూఆర్ రావ్  స్పేస్ సెంటర్​లో ప్రస్తుతం జియో శాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్​గా పనిచేస్తున్నారు. జీ శాట్–10, జీ శాట్–12 లాంచింగ్​లో కీలక పాత్ర పోషించారు.