
ముషీరాబాద్, వెలుగు: మహిళలు మానసిక స్థైర్యంతో ముందుకెళ్లాలని ఎన్డీటీవీ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ ఉమా సుధీర్ అన్నారు. ఇంటి పనుల్లో భాగస్వామ్యం వహిస్తూనే బాధ్యతాయుతమైన జర్నలిస్టు గా మహిళలు నిత్యం ఒత్తిడితో పని చేస్తున్నారన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూజే) ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.
‘జర్నలిజం- – మహిళలు– - సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సెమినార్ లో పలువురు సీనియర్ మహిళా జర్నలిస్టులు పాల్గొని మాట్లాడారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమా సుధీర్ మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టుల వారి స్వానుభవాలను చెబితే జర్నలిజంలోకి కొత్తగా వచ్చే మహిళలకు ప్రేరణగా ఉంటుందన్నారు. జర్నలిజం సులువు కాదని, మహిళలకు మరింత కష్టం అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యాలను ప్రస్తావిస్తూ జర్నలిస్ట్ లకు ప్రత్యేక హక్కులు అంటూ ఏమీ లేవన్నారు. హద్దులు మించిన కామెంట్లు సోషల్ మీడియాతో వస్తున్నాయని, ఇది జర్నలిజాన్ని దిగజార్చుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు సంస్థల్లో మహిళ జర్నలిస్టులకు కనీస సౌకర్యాలు లేవని ఎప్పారు. అందువల్ల మహిళలు జర్నలిజంలోకి ఎక్కువగా రావటం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ జర్నలిస్టు తులసీ చంద్ , టీ డబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సలీమా , ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలు రాధిక , జర్నలిస్టులు నాగవాణి , సురేఖ (ఇండియన్ టివి), వాణీ పుష్ప (వార్త) , కే లలిత (నవ తెలంగాణ), దివ్య (ఆంధ్ర జ్యోతి), నవీన (10టీవీ), భువన (ఎన్ టీవి) పాల్గొన్నారు.