బిజినెస్ డెస్క్, వెలుగు: దేశంలో వ్యాపారం చేయడానికి మగవారితో పోలిస్తే మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మహిళా ఎంటర్‌ప్రెనూర్లు గత రెండేళ్లలో రెండు రెట్లు పెరిగారని లింక్‌డిన్ రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. కంపెనీలు, సంస్థలలో కీలక పొజిషన్లలో మహిళల ప్రాతినిధ్యం మగవారితో పోలిస్తే తక్కువగా ఉందని, అయినప్పటికీ, ఎంటర్‌ప్రెనూర్లుగా మారాలనే ఆలోచన మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తోందని వివరించింది. తన ప్లాట్‌ఫామ్‌లోని యూజర్ల డేటాను సేకరించి ఈ రిపోర్ట్‌ను లింక్‌డిన్ తయారు చేసింది. ప్రస్తుతం లింక్‌డిన్‌కు దేశంలో 8.8 కోట్ల మంది యూజర్లు, గ్లోబల్‌గా 83 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. లింక్‌డిన్ డేటాతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్– 2022 ‘గ్లోబల్ జెండర్’ రిపోర్ట్‌లోని డేటాను కూడా ఈ రిపోర్ట్ కోసం తీసుకున్నామని లింక్‌డిన్ వివరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, దేశంలో వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన మహిళలు 2016–2021 మధ్య 2.68 రెట్లు పెరిగారు. ఇదే టైమ్‌లో వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన మగవారు కేవలం 1.79 రెట్లు మాత్రమే పెరిగారు. స్టార్టప్ ఫౌండర్ల నెంబర్‌ను బట్టి ఈ డేటాను లింక్‌డిన్ బయటపెట్టింది.
మహిళలకు ఉద్యోగాలిస్తున్నారు..
కరోనా టైమ్‌లో వేల మంది మహిళలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలనే ఆలోచన వీరిలో ఎక్కువగా కనిపించిందని చెప్పొచ్చు. లింక్‌డిన్ రిపోర్ట్ ప్రకారం, మహిళా ఎంటర్‌ప్రెనూర్లు 2020, 2021 లోనే ఎక్కువగా పెరిగారు. ఉద్యోగాల్లో లీడర్‌షిప్ పొజిషన్లలో ఉన్న మహిళలు కేవలం 18 శాతం మంది మాత్రమేనని లింక్‌డిన్ రిపోర్ట్ పేర్కొంది. కంపెనీలు, సంస్థల్లో మగవారితో పోలిస్తే మహిళా ఉద్యోగులు ఎక్కువ అడ్డంకులు ఎదుర్కొంటున్నారనే విషయం ఈ డేటా ద్వారా తెలుస్తోందని లింక్‌డిన్ సీనియర్ డైరెక్టర్ (ఇండియా) రుచీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. ‘ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ, చాలా మంది మహిళలు బిజినెస్ చేయడం ద్వారా తమకంటూ ఒక మార్గాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. లేదా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉండే కెరీర్‌లను ఎంచుకుంటూ తమకు నచ్చినట్టుగా బతుకుతున్నారు’ అని రుచీ ఈ సందర్భంగా వివరించారు.