ఆధునిక టెక్నాలజీ పెరుగుతుకొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాలన్నీ దాదాపు ఆన్లైన్ మోసాలకు సంబంధించినవే..ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులు,ఆధార్ కార్డు, పాన్ కార్డు డేటా స్టీలింగ్ తో ఆన్ లైన్ ఆర్థిక నేరాలకు పాల్పడుతూ బాధితుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులు, సీబీఐ,బ్యాంకు ఉద్యోగుల పేర్లతో పోన్లుచేయడం..బాధితులను బెదిరించి డబ్బులు ఖాతాల్లోకి మళ్లించుకోవడంవంటి సైబర్ నేరాలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా..వీటి సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో అన్ని వర్గాల వారు బాధితులే.. అయితే సైబర్ నేరాల్లో ఎక్కువ మంది బాధితులు మహిళలే అని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(NCRB) వెల్లడించడం ఆందోళన కలిగించే విషయం.
2022 నేరాలకు సంబంధించిన గణాంకాలను వెల్లడిస్తూ.. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (NCRB)..సంచలన విషయాలను బయటపెట్టింది. గతం కంటే క్రైం రేటు తగ్గినప్పటికీ.. సైబర్ క్రైం గణనీయంగా పెరిగిందని పేర్కొంది. ఇందులో 65 శాతం ఆన్ లైన్ మోసాలకు సంబంధించినవే. సైబర్ క్రైం బాధితుల్లో అన్ని వర్గాలు ఉన్నవారు ఉన్నప్పటికీ ఎక్కువగా మహిళలేనట. బాధితుల్లో 25 శాతం మహిళలే. మరోవైపు వేధింపులు, దాడులతో సహా మహిళలపై నేరాలు పెరిగాయని.. మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
సైబర్ క్రైంలో ఆకస్మిక పెరుగుదల భయంకరమైన ధోరణి. ఇందులో 65 శాతం కేసులు ఆన్ లైన్ మోసాలకు సంబంధించినవే. ఢిల్లీ లాంటి మహా నగరాల్లో సైబర్ బెదిరింపులు పెరిగాయి. వైట్ కాలర్ నేరాలుగా చెప్పుకునే సైబర్ ఆర్థిక నేరాలు దేశవ్యాప్తంగా 11.1 శాతం పెరిగాయి. 2022లో 1లక్షా 93 వేల కేసులు నమోదు అయ్యాయి. వీటిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక సైబర్ క్రైమ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. వీటిపై అవగాహన అవసరం అంటున్నారు సైబర్ పోలీసులు.