స్థానిక పోరులో మహిళలే కీలకం.. ప్రతీ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ

మహబూబాబాద్, వెలుగు: వచ్చే  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మహిళలే కీలకం కానున్నారు.  అన్ని జిల్లాల్లోనూ మహిళ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ జిల్లాల వారీగా ఓటర్ల లిస్ట్​లను సవరించి వివరాలను ప్రకటించింది.  రాష్ట్రంలో మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను అమలు చేస్ఉతండడంతోపాటు ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్​లను ప్రారంభించనుంది. ఈ పథకాలు  మహిళ ఓటర్లపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు వేస్తున్నారు.  మహిళలు కాంగ్రెస్​ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండడంతో  లోకల్ ​బాడీ ఎన్నికల్లో తమకు తిరుగులేని ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలు  ఆశిస్తున్నారు. 

మహిళలకే పెద్దపీట 

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు అధికారంలోకి రాగానే  ఆర్టీసీ బస్సుల్లో  ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అక్షలాది మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు.   రూ.500కే ఎల్​పీజీ  గ్యాస్ అందిస్తున్నారు. గృహజ్యోతి  ద్వారా 200 యూనిట్ల లోపు  వినియోగించే పేదవారికి  ఉచిత విద్యుత్​ అందిస్తున్నారు.  డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు  వడ్డీ లేని  రుణాలు,  శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, మహిళాసంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు తదితర కార్యక్రమాలు చేపట్టింది.  ఇందిరమ్మ ఇండ్లను కూడా  మహిళల  పేరు మీదే మంజూరు చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి స్కీమ్​లోనూ మహిళల కే పెద్దపీట వేస్తున్నారు.

పదవుల్లోనూ సగం

స్థానిక సంస్థల పదవుల్లో  మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. బలమైన అభ్యర్థులున్న చోట్ల జనరల్ సీట్లలో కూడా మహిళలు పోటీ చేసే అవకాశాలున్నాయి. దీంతో  లోకల్​ బాడీ పదవుల్లో మహిళలకు సగానికి పైగా దక్కనున్నాయి.