- వరంగల్ లేదా హైదరాబాద్‌లో నెలకొల్పే చాన్స్
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో మరో యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రత్యేకించి మహిళలకోసం ప్లాన్ చేస్తున్న ఆ యూనివర్సిటీని వరంగల్ లేదా హైదరాబాద్‌లో నెలకొల్పనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీని తిరుపతిలో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని విజయవాడలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ రెండూ ఏపీ వెళ్లాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లలోనే వరంగల్‍లో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. కానీ మహిళా వర్సిటీని మాత్రం ఏర్పాటు కాలే దు. ప్రస్తుతం దీనిపై కదలిక వచ్చిందని అంటున్నారు.
హైదరాబాదా.. వరంగల్లా ?
ఓయూ పరిధిలో నడుస్తున్న కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా వర్సిటీగా అప్ గ్రేడ్ చేసే అంశాన్ని ఏడాది క్రితం ప్రభుత్వం పరిశీలించింది. అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోఠి ఉమెన్స్ కాలేజీని సందర్శించారు. కానీ ఆ తర్వాత ఈ అంశంపై కదలిక లేదు. అయితే సోమవారం కడియం శ్రీహరి వరంగల్ లో మాట్లాడుతూ ‘త్వరలో రాష్ట్రంలో మహిళా వర్సిటీ ఏర్పాటు చేస్తాం. గత ఏడాదే పెట్టాల్సింది. కానీ ఆగిపోయింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తాం. అది హైదరాబాదా.. వరంగల్లా అనేది స్పష్టత రావాల్సి ఉంది’ అన్నారు.
‘రాణి రుద్రమ’ పేరుతో..
వరంగల్‍ను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ప్రముఖ విద్యాసంస్థలను వరంగల్‍కు కేటాయిస్తూ వచ్చారు. కాళోజీ హెల్త్ వర్సిటీ, కేంద్ర గిరిజన యూనివర్సిటీ, వెటర్నటీ, అగ్రికల్చర్ కాలేజీలు మంజూరు చేశారు. వీటికి తోడు ప్రైవేట్ సంస్థలైన హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. వరంగల్ కేంద్రంగా ‘రాణి రుద్రమ’ పేరుతో మహిళా వర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎన్నాళ్లుగానో ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి నాలుగు నెలలే ఉంది. ఈ లోగా మహిళా వర్సిటీని వరంగల్‍కు మంజూరు చేయించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు.