ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మే 13వ తేదీ ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలవ్వగా.. వేల సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలివచ్చారు. కొన్ని పోలింగ్ బూతుల్లో అయితే ఓటర్ల జాతర కనిపించింది. పోలింగ్ బూతుల దగ్గర తిరనాళ్ల సందడి నెలకొంది. వందల మంది క్యూలో కనిపించారు. ముఖ్యమైన అంశం ఏంటంటే.. పోలింగ్ బూతుల దగ్గర పురుషులు కంటే మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించటం విశేషం..
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వేల సంఖ్యలో ఒకేసారి తరలిరావటంతో పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. జన జాతరా.. ఓటర్ల జాతరా అన్నట్లు పోలింగ్ బూతుల దగ్గర సందడి నెలకొంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా ఓటర్లు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు రావటం కనిపించింది.
ఏపీలోని పట్టణాలు, అర్బన్ ఏరియాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.