మహిళా ఓటర్లదే కీలక పాత్ర​.. పురుష ఓటర్ల కంటే 87,181 మంది అధికం

నిజామాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. ఉమ్మడి జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 9,68,253 పురుష ఓటర్లు ఉండగా, 10,58,625 మహిళా ఓటర్లు  ఉన్నట్లు లెక్క తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో అతివలు ఎవరి వైపున నిలిస్తే, వాళ్లదే విజయమనే పరిస్థితి ఉంది.

మొదటి నుంచి ఆధిక్యమే..

ఉమ్మడి జిల్లాలో రాజకీయాలను శాసించే స్థాయిలో మహిళా ఓటర్ల సంఖ్య ఉంది. మొదటి నుంచి జిల్లాలో మహిళా ఓటర్లదే ఆధిక్యత కొనసాగుతోంది. ఓటర్​లిస్ట్​ సవరణకు ముందు 9,37,246 పురుష ఓటర్లు ఉండగా, ఫైనల్​ లిస్ట్ లో​31,007 మంది పురుష ఓటర్లను కొత్తగా చేర్చారు. 

ALSO READ  :- ఎమ్మెల్యేలకు నిరసన సెగ.. డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లపై నిలదీత

దీంతో ప్రస్తుతం వీరి సంఖ్య 9,68,253 కు చేరింది. సవరణకు ముందు 10,24,427 మహిళా ఓటర్లు ఉండగా, 34198 మంది మహిళా ఓటర్లను కొత్తగా చేర్చారు. దీంతో మహిళా ఓటర్ల సంఖ్య 10,58,625కు పెరిగింది. ఉమ్మడి జిల్లాలో 87,181 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

అర్బన్ లో అధికంగా..

ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ ​నియోజకవర్గంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. తర్వాత స్థానాల్లో నిజామాబాద్​ రూరల్, కామారెడ్డి, బాల్కొండ, ఎల్లారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్​డ్​  జుక్కల్ నియోజకవర్గం చివరి స్థానంలో ఉంది.

ఆశావహులు స్వల్పం..అందేనా అవకాశం

సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉన్నా, అసెంబ్లీ ఎలక్షన్ టికెట్ల కోసం చాలా తక్కువ మంది మహిళలే పోటీపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ తరఫున సిట్టింగులకే అవకాశం లభించగా, అర్బన్​ నుంచి టికెట్​ఆశించిన ఆకుల లలిత, కామారెడ్డి నుంచి మున్సిపల్ చైర్​పర్సన్​ నిట్టు జహ్నవికి ఆశాభంగం ఎదురైంది. ఆర్మూర్​ కాంగ్రెస్ ​టికెట్​ కోసం వేముల రాధికారెడ్డి, బాల్కొండ నుంచి ప్రేమలత అగర్వాల్, జుక్కల్ ​బీజేపీ టికెట్ ​కోసం అరుణతార, బాల్కొండ నుంచి ఆలూరు విజయభారతి మొత్తం నలుగురే తమకు టికెట్ కావాలని ఆర్జీ పెట్టారు. వీరిలో ఎవరికి పోటీ ఛాన్స్ ​దక్కుతుందో త్వరలో తేలనుంది. అయితే తమకు టికెట్లు కేటాయించాలంటూ ఉమ్మడి జిల్లాలో  131 మంది పురుషులు బీజేపీ, కాంగ్రెస్ హైకమాండ్​లకు అర్జీలు పెట్టుకున్నాయి.

మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మూర్ ​సెగ్మెంట్​లో రైస్​కుక్కర్లు, మిక్సీలు పంచుతూ, తమకు ఓటు వేయాలని మహిళా ఓటర్లను అడుగుతున్నారు. బోధన్​లో కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో బతుకమ్మ చీరల పంపిణీ ముమ్మరంగా జరుగుతుంది.