Women's Asia Cup 2024: ఫైనల్లో టీమిండియా ఓటమి.. ఆసియా కప్ విజేత శ్రీలంక

Women's Asia Cup 2024: ఫైనల్లో టీమిండియా ఓటమి.. ఆసియా కప్ విజేత శ్రీలంక

మహిళల ఆసియా కప్‌ 2024 టోర్నీ విజేతగా ఆతిథ్య శ్రీలంక జట్టు అవతరించింది. ఆదివారం(జులై 28) భారత మహిళలతో జరిగిన టైటిల్ పోరులో లంకేయులు 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. తొలుత భారత మహిళలు 165 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ, దానిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. లంక బ్యాటర్లలో చమరి ఆటపట్టు(61), హర్షిత సమరవిక్రమ(69 నాటౌట్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆతిథ్య జట్టుకు ఇది తొలి ఆసియా కప్‌ టైటిల్.

రాణించిన మంధాన‌

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 165 పరుగులు చేశారు. భీక‌ర ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ స్మృతి మంధాన‌(60) అర్ధ శ‌త‌కంతో మెరవగా.. జెమీమా రోడ్రిగ్స్(16 బంతుల్లో 29), రిచా ఘోష్(14 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

ఆటపట్టు అద్భుతం

అనంతరం 166 భారీ పరుగుల భారీ చేధనను లంక కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 8 బంతులు మిగిలివుండగానే చేధించింది. కెప్టెన్ చమరి ఆటపట్టు(61; 43 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), వన్ డౌన్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ(69 నాటౌట్; 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇద్దరే మ్యాచ్‌ను శాసించారు. ఈ జోడీ భారత బౌలర్ల ఎత్తుగడలను సమర్థవంతంగా ఎదురొన్నారు. అవసరమైన పరుగులు క్రమం తప్పకుండా చేస్తూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. చివరలో కవిషా దిల్హరి(16 బంతుల్లో 30 నాటౌట్) బ్యాట్ ఝుళిపించింది.

లంక మహిళా బ్యాటర్ల అద్భుత పోరాటం, భారత ఫీల్డర్ల క్యాచ్‌లు జారవిడచడం శ్రీలంకకు తొలి టైటిల్ కట్టబెట్టింది.