జానీ బాధితురాలికి కచ్చితంగా అండగా ఉంటాం: చైర్ పర్సన్ నేరేళ్ల శారద

జానీ బాధితురాలికి కచ్చితంగా అండగా ఉంటాం: చైర్ పర్సన్ నేరేళ్ల శారద

హైదరాబాద్: టాలీవుడ్‎లో ప్రకంపనలు రేపుతోన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ లైంగిక వేధింపుల కేసుపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద కీలక వ్యాఖ్యలు చేశారు. జానీ చేతిలో లైంగిక వేధింపులకు గురైన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఇవాళ (సెప్టెంబర్ 18) మహిళా కమిషన్‎ను ఆశ్రయించింది. ఈ మేరకు చైర్ పర్సన్ నేరేళ్ల శారదను కలిసి జానీ మాస్టర్‎పై ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా శారద మీడియాతో మాట్లాడుతూ.. కొరియోగ్రాఫర్ జానీ లైంగికంగా వేధిస్తుండటంతో బాధితురాలు ధైర్యంగా బయటకు వచ్చి తమకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. 

మహిళా కమిషన్ మీద నమ్మకంతో వచ్చానని బాధితురాలు తనకు చెప్పిందని.. జానీ ఇష్యూలో బాధితురాలికి కచ్చితంగా మహిళా కమిషన్ అండగా నిలబడుతుందని భరోసా  ఇచ్చారు. బాధితురాలికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్టంలో ఉన్న ప్రతి ఒక్క మహిళాకు మేము అండగా ఉంటామని భరోసా కల్పించారు.  సినిమా ఇండస్ట్రీలో ఉన్న  సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.  

తాను మహిళా కమిషన్ చైర్ పర్సన్‎గా ఛార్జ్ తీసుకొని రెండు నెలలు అవుతుందని.. ఫ్రీవెన్షిన్ ఆఫ్ సెక్స్ వాల్ అర్రాస్ మెంట్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని వెల్లడించారు. ఆడపిల్లకు పరిమితులు పెట్టడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేసిన శారద.. నాలుగు గోడల మధ్య మహిళలను బంధించడం సరికాదన్నారు. తెలంగాణ రాష్టంలో ప్రతి మహిళలకు రక్షణ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని చెప్పారు.