విచారణకు రావాల్సిందే: వేణుస్వామికి రెండోసారి నోటీసులు

విచారణకు రావాల్సిందే: వేణుస్వామికి రెండోసారి నోటీసులు

హైదరాబాద్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. కోర్ట్ ఆదేశాల మేరకు రెండో నోటీస్ జారీ చేసిన మహిళా కమిషన్.. 2024, నవంబర్ 14వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. కాగా, సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ జ్యోతిష్యుడు వేణుస్వామి ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే త్వరలో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్న యాక్టర్స్ నాగ చైతన్య, శోబిత దూళిపాళ్ల  వైవాహిక జీవితం తొందరలోనే పెటాకులు అవుతుందంటూ వేణు స్వామి చెప్పిన జ్యోతిషం తీవ్ర వివాదస్పదమైంది.

పెళ్లి కూడా కాకుండానే అప్పుడే విడాకులు తీసుకుంటారంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోబిత వైవాహిక జీవితంపై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‎కు పలువురు మహిళ జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు మేరకు వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. 

మహిళా కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నోటీసులపై స్టే విధించాలని కోరగా.. వేణుస్వామి అభ్యర్థనకు ఒకే చెప్పిన న్యాయస్థానం.. మహిళా కమిషన్ నోటీసులపై స్టే విధించింది. తాజాగా వేణుస్వామికి ఇచ్చిన స్టేను ఎత్తివేసిన హైకోర్టు.. అతడిపై వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో వేణుస్వామికి రెండో మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసి.. ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.