గండిపేట, వెలుగు: రాష్ట్రంలో విమెన్ సేఫ్టీ కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకొచ్చామని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో గండిపేటలోని తెలంగాణ పోలీస్ అకాడమీలో విమెన్స్ డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. చీఫ్ గెస్టుగా హాజరైన డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా భద్రతపై పోలీస్ శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మహిళలు అభద్రతా భావానికి గురయ్యేవిధంగా ఎలాంటి ఘటన జరిగినా సహించేది లేదన్నారు. షీటీమ్స్, భరోసా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, గృహహింస నిరోధక చర్యలతో యువతలు, మహిళల్లో కాన్ఫిడెన్స్ వచ్చిందని ఆయన చెప్పారు. విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ షికా గోయల్ మాట్లాడుతూ.. మహిళల భద్రతకు ప్రభుత్వం ఎక్కువ
ఇంపార్టెన్స్ ఇస్తోందన్నారు. అడిషనల్ డీజీలు అభిలాష్ బిస్త్, స్వాతి లక్రా, డీఐజీ సుమతి, మహిళా పోలీసులు పాల్గొన్నారు.
భారత సంస్కృతిలో మహిళల పాత్ర గొప్పది
భారత సంస్కృతిలో మహిళల పాత్ర గొప్పదని ఎమ్మెల్సీ సురభి వాణి దేవి అన్నారు. వాటర్ బోర్డు విమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని హెడ్డాఫీసులో ఇంటర్నేషనల్ విమెన్స్ వేడకలను సోమవారం నిర్వహించారు. చీఫ్ గెస్టుగా హాజరైన వాణిదేవి మాట్లాడుతూ.. మహిళలు ఏ రంగాన్ని ఎంచుకున్నా పట్టుదలతో పనిచేయాలన్నారు.కార్యక్రమంలో వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్, అసోసియేషన్ అధ్యక్షురాలు సుగంధిని, జనరల్ సెక్రటరీ బిల్కిస్ భాను పాల్గొన్నారు. సినీ నటి కొండపల్లి రూత్ అలేఖ్య, యువ ఫ్యాషన్ డిజైనర్ యామిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలె: కృష్ణయ్య
ముషీరాబాద్: మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం ప్రజాస్వామ్యాన్ని సమర్థించడమే అవుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు తక్షణమే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ శెట్టిబలిజ సంఘం హాల్ లో పీఆర్ కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో సోమవారం విమెన్స్ డే వేడుకలు జరిగాయి. కృష్ణయ్యతోపాటు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ హాజరయ్యారు. వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలను సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రచన శ్రీ, తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ పీసీబీ ఆఫీసులో..
జీడిమెట్ల: సనత్ నగర్ లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసులోనూ విమెన్స్ డే వేడుకలు జరిగాయి. పీసీబీ చీఫ్ ఇంజినీర్ రఘు హాజరై విషెస్ తెలిపారు.
మహిళలు సమైక్యంగా ఉంటేనే హక్కుల సాధన: సీఎస్ శాంతికుమారి
మహిళలు సమైక్యంగా, సమన్వయంతో ఉంటేనే తమ హక్కుల సాధనకు మార్గం ఏర్పడుతుందని సీఎస్ శాంతికుమారి అన్నారు. బీఆర్కే భవన్‌లోని సెక్రటేరియేట్‌లో మహిళా అధికారులు, సిబ్బంది నిర్వహించిన విమెన్స్ డే వేడుకలకు ఆమె చీఫ్‌గెస్టుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, మాట్లాడారు. ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ రాణికుముదిని, ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, ప్రశాంతి, సచివాలయ మహిళా ఉద్యోగ సంఘం నాయకురాలు చిట్టి రాణి, ఎం.మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.