మహిళా దినోత్సవం అంటే.. ముగ్గులు, వంటల పోటీలు కాదు

మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అనేది పెద్దలు చెప్పిన మాట. పూర్వకాలం నుంచి మనదేశంలో స్త్రీలను గౌరవిస్తూ పూజిస్తున్నాం. దేశాన్ని భరతమాతగా కొలుస్తున్నాం. అయినా మన దేశంలో స్త్రీలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నారు. అకృత్యాలకు గురవుతూనే ఉన్నారు. ఓటు హక్కు మొదలుకుని ఎనిమిది గంటల పని దినాల వరకూ ఎన్నో ఏండ్లుగా మహిళా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ఉద్యమాల నుంచి పురుడు పోసుకున్నదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

అణగారిన వర్గాలకు అణిచివేత సంకెళ్ల నుంచి విముక్తి కలిగించేందుకు కార్మిక వర్గాలు ఎన్నో పోరాటాలు చేశాయి. ఇక్కడ మహిళలు కూడా అణగారిన వర్గాలకు చెందిన వారుగా గుర్తించాలి. కార్మిక వర్గాల పోరాటాల్లో మహిళలు కూడా ముందుండి పాల్గొన్నారు. 1910 ఆగస్టు 26, 27వ తేదీల్లో 2వ అంతర్జాతీయ సోషలిస్టు మహిళా సదస్సు డెన్మార్క్‌‌‌‌లోని కోపెన్‌‌‌‌ హెగెన్‌‌‌‌లో జరిగింది. ఈ సదస్సుకు క్లారా జెట్కిన్ అధ్యక్షత వహించగా 17 దేశాల నుంచి వంద మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో మహిళలకు ఓటు హక్కు, మెటర్నిటీ ఇన్సూరెన్స్‌‌‌‌తో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై చరిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. ఆ తర్వాత చాలా దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. కానీ, అంతర్జాతీయంగా మహిళల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టేందుకు 1977లో యునైటెడ్‌‌‌‌ నేషన్స్‌‌‌‌ సర్వసభ్య సభ తీర్మానం చేసి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఆమోదించింది. 150 దేశాలు దీనికి మద్దతు ఇచ్చాయి. తమ దేశాల్లో మహిళల పట్ల వివక్ష తొలగిస్తామని మహిళా దినోత్సవం తమ ఎజెండాలో ప్రధానాంశంగా ఉంటుందని ప్రకటించాయి. అప్పటి నుంచి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

వేడుకలు కాదు.. సమస్యలపై చర్చించాలి

ఎన్నో పోరాటాలు, ఉద్యమాలతో వచ్చిన మహిళా దినోత్సవం మూలాలు నేడు కనుమరుగు అయిపోతున్నాయి. మహిళా చైతన్యానికి మార్గం వేయాల్సిన ఈ వేడుకలు ఇప్పుడు ముగ్గుల పోటీలు, వంటల పోటీలుగా మారాయి. కొందరు వ్యాపారులు తమ బిజినెస్ పెంచుకునేందుకు దుకాణాల్లో చీరలపై డిస్కౌంట్ సేల్ పెట్టే వరకు వెళ్లింది. మహిళలను ఇలాంటి మార్కెట్ చట్రంలోకి మళ్లించడంతో వారు తమ కోసం, తమ హక్కుల కోసం ఏ మాత్రం ఆలోచించలేకపోతున్నారు. మహిళల ఇబ్బందులు, పురుషాధిక్య సమాజంలో ఎదుర్కొంటున్న వివక్షపై చర్చించాల్సిన రోజును, ఒక ఆహ్లాదకరమైన వేడుకగా మార్చడం దురదృష్టకరం.

చరిత్రలో మగువకే ప్రాముఖ్యత

ఆదిమ కాలంలో కుటుంబంలో స్త్రీకే ప్రాముఖ్యత ఉండేది. ఆహారం సమకూర్చే పనులు చేసేది. కానీ, పిల్లల్ని కనడం, స్త్రీలలో ప్రకృతిపరంగా సంభవించే మార్పులను ఆసరాగా చేసుకుని ఇప్పుడు ఇంటికే పరిమితం చేశారు. క్రమంగా మహిళలను ఒక బానిసగా చూడటం మొదలుపెట్టారు. చంద్రగుప్త మౌర్యుని కాలంలో అంగరక్షకులుగా సాయుధులైన స్త్రీలు ఉండేవారు. ఈ విధానం విజయనగర రాజుల వరకు కొనసాగింది. శాతవాహనుల కాలంలో గౌతమీపుత్ర శాతకర్ణి.. వశిష్ట పుత్ర శాతకర్ణిగా తల్లి పేర్లతో ప్రసిద్ధికెక్కారు. ఇలా ప్రాచీన కాలంలో మహిళల ప్రాధాన్యత గుర్తించవచ్చు. చాళుక్య రాజుల కాలంలో కూడా అనేక మంది స్త్రీలు ఆలయ నిర్మాణాలు, తటాకాలు తవ్వించడం, విద్యాలయాలు స్థాపించడం వంటి పనులు చేసి పేరుపొందారు. కాకతీయుల కాలంలో స్త్రీలు చాలా ముందంజలో ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం, రాణి రుద్రమదేవి చరిత్ర గురించి తెలియని వారు ఉండరు. ప్రజల అభిమానం పొందిన గొప్ప రాణి, సామ్రాజ్యాధి నేత రుద్రమదేవి.

ఆధునిక కాలంలో కొనసాగుతున్న వివక్ష

ఈ ఆధునిక సమాజంలో ఆకాశంలో సగం, అవనిలో సగం అని పిలువబడుతున్న ఆడవాళ్ల పట్ల వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది. జీతం లేని ఇంటిపనితోపాటు జీవితం కోసం బయట ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఇలాంటి మహిళలకు సమాజం సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు ఆడపిల్లను భారంగా భావిస్తున్నారు. ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి తమ బాధ్యత ముగిసిందన్న భావనలో వారు ఉంటున్నారు. ఉద్యోగం చేసే మహిళ కూడా తన నెల జీతాన్ని భర్తకు ఇచ్చి ఖర్చులకు మళ్లీ భర్త వద్ద చేయి చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. మహిళలకు ఆస్తి హక్కు అనేది కాగితాలకే పరిమితమైంది. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు చదువుతున్నా.. పని చేసే విషయంలోనూ అమ్మాయిలు వివక్షను ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాల్లో మగాళ్లతో సమానంగా పని చేస్తున్నప్పటికీ ఆడవారికి సమాన వేతనం ఇవ్వడం లేదు. పురుషుల కంటే స్త్రీలు 40 శాతం తక్కువ జీతాలు తీసుకుంటున్నారు. పని విషయంలో, జీతాల విషయంలో ఈ మధ్య కాలంలో కొంత మార్పు వచ్చినా ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది.

ఆకృత్యాలు ఆగడం లేదు

మనదేశంలో మహిళలపై ఆకృత్యాలు ఆగడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పార్లమెంట్‌‌‌‌లో మహిళా బిల్లుకు ఆమోదం లభించడం లేదు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు చేసిన చట్టాల అమలులో లోపాలు ఉన్నాయి. ఫలితంగా దాడులకు పాల్పడిన వారు శిక్షల నుంచి సులభంగా తప్పించుకుంటున్నారు. అందుకే మహిళలపై నానాటికీ దాడులు పెరుగుతున్నాయి. అమ్మాయిల ప్రాణాలు తీసిన వారికి కఠిన శిక్షలు అమలు కాకపోవడంతో ఆడపిల్లలు అర్ధరాత్రి కాదు పట్టపగలే ధైర్యంగా నడవలేని పరిస్థితులు దాపురించాయి. బడి, గుడి, ఇల్లు, ఆఫీసు, కాలేజీ ఇలా ప్రతి చోటా మహిళలకు రక్షణ కరువైంది. స్వాతంత్ర్యానికి పూర్వం మహిళను ఇంటికే పరిమితం చేసిన కొన్ని సనాతన సంప్రదాయాలు మళ్లీ ఇప్పుడు జీవం పోసుకోవడం బాధాకరం. వేధింపులకు గురయ్యే మహిళలను ఆదరించాల్సిన సమాజం ఆమెనే దోషిగా చూడటం దారుణం. నెలల పాప నుంచి 90 ఏండ్ల వృద్ధురాలు వరకు అత్యాచారాలకు గురవుతున్నారు. కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినా, చట్టాలు ఎంత కఠినం చేసినా, పోలీసులు ఎన్‌‌‌‌కౌంటర్లు చేసినా ఈ దారుణాలు ఆగడం లేదు.

మహిళలే పోరాటాలు చేయాలి

మహిళలు ఆర్థికంగా ఎదిగి సాధికారత సాధించగలిగితే తమ కాళ్ల మీద తాము నిలబడే పరిస్థితి వస్తుంది. ఆత్మవిశ్వాసం, స్వశక్తితో కొంతమంది మహిళలు విద్యా, వ్యాపార, రాజకీయ, వైద్య రంగాల్లో దూసుకుపోతున్నారు. కానీ, మహిళలు సమానత్వాన్ని సాధించాలంటే సమాజంలోని అన్ని వ్యవస్థల్లో ఉన్న ఆధిపత్య భావజాలాన్ని రూపుమాపాలి. అప్పుడే మహిళలు ఆర్థిక సమానత్వాన్ని పొందగలుగుతారు. మహిళా సమానత్వాన్ని సాధించేందుకు కొత్త చట్టాలను తేవాలి. అవసరమైతే ఉన్న చట్టాలను మార్చాలి. మహిళల సమస్యల పరిష్కారానికి వారే నాయకత్వం వహించాలి. వారు వేసే అడుగులు భవిష్యత్తుకు బాటలుగా మారాలి. అందుకోసం ప్రభుత్వాలు కూడా మహిళల స్వయం ఉపాధి అవకాశాలను మెరుగు పరచాలి. వారికి వృత్తి నైపుణ్యాలను అందించాలి. వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా, పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహించాలి. మహిళల్లో ఉన్న నాయకత్వ పటిమను, పరిపాలనా దక్షతను గుర్తించి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లినప్పుడే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సార్థకత దక్కుతుంది.

ఆడ పిల్లను కడుపులోనే చంపేస్తున్నరు

మహిళల సర్వతోముఖాభివృద్ధితో దేశాభివృద్ధి కూడా ముడిపడి ఉంది. కానీ మన దేశంలో ఉన్న లింగ వివక్షత వల్ల మహిళలు ఆర్థికాభివృద్ధికి దూరమవుతున్నారు. 2001లో వెయ్యి మంది పురుషులకు 927 మంది మహిళలు ఉండగా 2015 నాటికి అది 903కి పడిపోయింది. పుట్టేది ఆడపిల్ల అని తెలిసి చట్టవ్యతిరేకంగా అబార్షన్ పేరుతో కడుపులోనే చంపేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2011లో 8 మిలియన్ల ఆడశిశువులను అబార్షన్ పేరుతో చంపేశారు. ఒకవేళ ఆడపిల్ల పుడితే వారి పోషణ, చదువు, ఆరోగ్యం విషయంలో కూడా ఎంతో వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల అక్షరాస్యత రేటు 82.14% కాగా, స్త్రీల అక్షరాస్యత 65.46 శాతమే. సెకండరీ ఎడ్యుకేషన్‌‌‌‌ పూర్తి చేసిన బాలికలు మనదేశంలో 16.6% ఉండగా, బాలురు 50.4% ఉన్నారు. మనదేశంలో ఏటా సుమారు కోటి ఇరవై లక్షల మంది బాలికలు జన్మిస్తున్నారు. వీరిలో సుమారు 30 లక్షల మంది 15 ఏండ్లలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. ఐదేండ్లలోపున్న బాలికల మరణాల సంఖ్య తగ్గినా.. ఇప్పటికీ వందలో 15 మంది బాలికలు 5 సంవత్సరాల లోపు చనిపోతున్నారు. వైద్య సౌకర్యం, ఆహారం విషయంలో అబ్బాయిలకు, అమ్మాయిలకు మధ్య తేడా చూపడమే దీనికి కారణం. డా.సుంకరనేని నాగవాణి, సోషల్ యాక్టివిస్ట్.