ఇండియాలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించిన మహిళల సంఖ్య తక్కువేమీ కాదు. అయితే, జెండర్ ఈక్వాలిటీ లేకపోవడంవల్ల సమానమైన అవకాశాలుమాత్రం దక్కడం లేదు. విద్య, వైద్యం , పొలిటికల్ ఎంపవర్‌మెంట్ వంటి రంగాల్లో మహిళా ప్రాతినిధ్యం సమంగా లేదు. రిఫ్మార్మ్స్ తర్వాత లేబర్ ఫోర్స్ క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. ఈ ఏడాది మహిళ దినోత్సవాన్ని ‘బ్యాలెన్స్ ఫర్ బెటర్’ కాన్సెప్ట్‌కి బాగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
‘‘బ్యాలెన్స్ ఫర్ బెటర్ కాన్సెప్ట్‌తో అంతర్జాతీయ మహిళా దినోత్సవం–2019ని ప్రపంచమంతా నిర్వహిస్తోంది. స్త్రీల హక్కులే మానవ హక్కులుగా భావించడం ఈ కాన్సెప్ట్ ఉద్దేశం. జెండర్ ఈక్వాలిటీ దిశగా ప్రచార కార్యక్రమాలు జరపాలని ఐక్య రాజ్య సమితి పిలుపునిచ్చింది. ఇండియాలో మహిళ హక్కుల ఉద్యమాలకు చాలా చరిత్ర ఉంది. పురాణ కాలంలో పితృస్వామ్యాన్ని ధిక్కరించిన గార్గి మైత్రేయి, విద్యాధరి మొదలుకొని బౌద్ధం, చార్వాకం రోజుల్లోనూ, మౌర్యుల పాలనలోనూ స్త్రీలపట్ల సమానత్వాన్ని పాటించారు. బ్రిటిషర్ల పాలనపై పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి అజుందనీ, బేగం అలియా, బేగం హజ్రత్ మహల్, రాణి చెన్నమ్మ, రుద్రమదేవి చరిత్రలో కనిపిస్తారు. బ్రిటిష్ ఇండియాలోనే రాజారాం మోహన్ రాయ్, పూలే దంపతులు, అంబేద్కర్, రనడేల నాయకత్వంలో మహిళా ఉద్యమాలు ఊపందుకున్నాయి. స్త్రీల ప్రగతితోనే సోషల్ డెవలప్‌మెంట్ సాధ్యమని అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ కల్పించారు. లింగ, ఆర్థిక వివక్షలను అంతం చేయడానికి హిందూ కోడ్ బిల్లును, చట్టాలను రూపొందించారు. కానీ, మహిళా ప్రగతిలో మాత్రం ఇండియా వెనకబడే ఉంది.
వరల్డ్ ఎకానమికల్ ఫోరం తాజా నివేదిక ప్రకారం విద్య, ఆరోగ్యం , ఆర్థిక రాజకీయ సాధికారతలో మన దేశం 108వ స్థానంలో ఉంది. 149 దేశాల్లోని పరిస్థితిని రివ్యూ చేసి ఈ జాబితాని రూపొందించింది. పొలిటికల్ ఎంపవర్‌మెంట్ లో మహిళలు చాలా వెనుకబాటుతనంలో ఉన్నారు. ప్రస్తుత లోక్‌సభలో కేవలం 66 మంది స్త్రీలు (12.5%) మాత్రమే ఉన్నారు. అలాగే, రాజ్యసభలో 30 మంది మహిళలు (12.4%) ఉన్నారు. ఇక, కేంద్ర కేబినెట్ లోని 64 మంత్రులలో మహిళలు కేవలం 8 మంది మాత్రమే. 2018లో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ , తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో 678 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, వీరిలో 62 మంది మాత్రమే మహిళా ఎమ్మెల్యే లు ఉన్నారు. చట్టసభల్లో మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం కోసం తెచ్చిన బిల్లు ఇప్పటికీ పాస్ కాలేదు. లేబర్ ఫోర్స్‌లోనూ మహిళల వాటా 42% నుంచి 24 శాతానికి పడిపోయింది. వ్యవసాయం, పాడి, పశు సంపద వంటి రంగాలలో స్త్రీలు క్రమేణా దూరమవుతున్నారు. మన దేశంలో జిడిపిలో స్త్రీల వాటా కేవలం 7 శాతమే, చైనాలో 41 శాతం వరకు ఉంది. వేతనాలలో వ్యత్యాసం, స్కిల్ లోపించడం, పురుషాధిపత్యం వంటి కారణాలతో మహిళా లేబర్ ఫోర్స్ తగ్గిపోతోంది. మహిళలకు హెల్త్ విషయంలో జిడిపిలో కేవలం ఒక శాతం మాత్రమే ఆరోగ్యం పై ఖర్చుచేస్తున్నారు. దీనివల్ల స్త్రీలు ప్రైవేటు దవాఖానాల్లో చేరి వేలాది రూపాయల బిల్లులు కడుతున్నారని నేషనల్ స్టాటస్టికల్ శాంపుల్ సర్వే తెలియజేసింది. దేశంలో 17.3 శాతం మంది మహిళలు మాత్రమే ఆరోగ్య కార్యకర్తలను సంప్రదిస్తున్నారని, 17.9% మంది పిహెచ్ సీల్లోనే లేడీ డాక్టర్ లు ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది. ప్రసూతి మరణాల రేటు తగ్గించాలన్న లక్ష్యం ఇప్పట్లో నెరవేరేలా లేదు.
-అస్నాల శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం