Women's Day Special: ‘ఈ పని చేసేటంత తెలివి నీకు లేదు’.. అనే రోజు నుంచి.. ఆమె నిలిచి గెలిచింది

Women's Day Special: ‘ఈ పని చేసేటంత తెలివి నీకు లేదు’.. అనే రోజు నుంచి.. ఆమె నిలిచి గెలిచింది

ఒక పురుషుడికి చదువు చెప్పించు.. అతనొక్కడే చదువుకున్నవాడవుతాడు. ఒక మహిళకు చదువు చెప్పించు.. ఆమె ఒక తరాన్నే చదివిస్తుంది.
-బ్రిగమ్ యంగ్, అమెరికన్ మత ప్రచారకర్త

స్త్రీ, మహిళ, ఆడపిల్ల.. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆమెనే. అమ్మ, అత్త, అక్క, భార్య, చెల్లి, కూతురు.. ఎట్లాంటి పేర్లతో పిలుచుకున్నా ఆమెనే. మనిషికి నాగరికత అలవాటై కొన్ని వేల సంవత్సరాలు అయ్యిందని లెక్కలు తీస్తరు. ఈ వేల సంవత్సరాలుగా 'ఆమె' జీవితం మారుతనే ఉంది. అయితే, అదంతా ఒక చట్రంలోనే! 'నీ శరీరం పనిచేస్తానికి సహకరించదు' అన్నరు ఒకప్పుడు. 'ఈ పని చేసేటంత తెలివి నీకు లేదు' అన్నరు ఇంకోసారి. 'వీళ్లతో నువ్వేం పోటీ పడుతవు' అన్నరు ఆ తర్వాత, 'నువ్వు ఓటెయ్యొద్దు'. 'నీకు రాజకీయాలేంది?', 'మగోడి కంటే ఎక్కువ సంపాదిస్తవులే?.. ఇట్లాంటి మాటలెన్నో విన్నా. ఆమె అట్లనే నిలబడ్డది గట్టిగా!

ఇయ్యాల ఒక్కో కాలంల ఎదురైన ఒక్కో ప్రశ్నను ఎదుర్కొని వచ్చి నిలబడ్డ ఆమెకు.. సొంతంగా, చెప్పుకునేందుకు ఒక పేరుంది. ఇయ్యాల విమెన్స్ డే. ఆమె ఈ మాటలన్నీ దాటొచ్చి నిలబడ్డందుకు, ఈ రోజున.. సెలబ్రేట్ వుమన్ హుడ్.

అన్ని కథల్లోనూ ఆమే!

ఒక రెండు కథలు చెప్పుకుందాం. నిజంగా జరిగినవి. ఆ రెండు కథల్లో మహిళే ప్రధానం. కాకపోతే, ఆ కథల్లో మహిళలు వేర్వేరు ప్రపంచాల్లో ఉంటారు. గ్యారీ ఓల్డ్ మన్ అని హాలీవుడ్ లో ఒక అద్భుతమైన నటుడు ఉన్నాడు. తన నలభై ఏళ్ల యాక్టింగ్ కెరీర్ లో కొన్ని అద్భుతమైన సినిమాల్లో నటించారాయన. కాకపోతే 2018 వరకూ నలభై ఏళ్లలో ఎప్పుడూ హాలీవుడ్ సినిమా గొప్పదిగా భావించే ఆస్కార్ అందుకోలేదు గ్యారీ. 2018 లో ‘ డార్కెస్ట్ అవర్’ అనే సినిమాకు గ్యారీకి బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ వచ్చింది. ఆ రోజు ఆస్కార్ అందుకుంటూ, తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన చాలామందికి థ్యాంక్స్ చెప్పాడు. స్పీచ్ చివర్లో, " అమ్మా! నన్ను ఇంతలా ప్రేమించే, నన్నెప్పుడూ సపోర్ట్ చేసే నీకు థ్యాంక్స్. చాయ్ తాగుదాం, కెటిల్ ఆన్ చేసి పెట్టు, నేను ఇంటికి అస్కార్ పట్టుకొస్తున్నా" అన్నాడు. నలభై ఏళ్ల తన సినీ జీవితంలో దక్కిన ఒక గౌరవాన్ని పొందుతూ వాళ్ల అమ్మను గుర్తు చేసుకున్నాడు గ్యారీ. ఈ కథలో ఉన్న 99 ఏళ్ల మహిళ, చాలా సాదాసీదాగా ఇల్లు, పిల్లలు అని బతికిన మనిషి.

 ఇంకో కథ ఉంది. 'త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ' సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఫ్రాన్సెస్ మెక్ డోరమెండ్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా ఆస్కార్ వచ్చింది. ఆ అవార్డు అందుకుంటూ సినీ పరిశ్రమలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను రెండు నిమిషాల్లో చెప్పిందామె. ఆడవాళ్లకూ మగవాళ్లలానే గౌరవం, సంపాదన దక్కాలని ఆమె అక్కడున్న ఆడవాళ్లందరినీ తనతో కలిసి పోరాడమని అడిగింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఈ కథలో ఉన్న మహిళ ఇల్లు దాటొచ్చి, మగవాళ్లకు పోటీ ఇచ్చి సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడిన మనిషి. ఇదీ 2018 ఆస్కార్ వేడుకలోనే జరిగిన సంఘటన. 

ఒకే రోజు కనిపించిన ఈ రెండు కథల్లో మనం చెప్పుకున్నఈ మహిళలు వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతున్నా.. వేర్వేరు ఆలోచనలు ఉన్నా.. వాళ్లు ఈ సమాజానికి మంచినే ఇస్తున్నారు, చేస్తున్నారు. ఇది మొత్తం ప్రపంచాన్ని అద్దంలో చూపే చిన్న విషయం.

ఆమె ఎలా ఉంది..?

ఈమెను గుర్తించరు!

బాగా చదువుకుని, చక్కగా ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ల విషయం పక్కనబెడితే, కేవలం ఇంటి కోసం, పిల్లల కోసం ఉద్యోగం వదిలేసి ఇంటికే పరిమితమైన ఆడవాళ్లను ఇవ్వాల్టికీ చిన్న చూపే చూస్తుంటారు చాలామంది. కాకపోతే ఇది జీతం లేని ఉద్యోగం అంతే. 

జీతాలు మాత్రం అంతంతే

ఎంత పెద్ద ఇండస్ట్రీ అయినా, ఒక మహిళ ఎంత పొజిషన్ లోకి వెళ్తున్నా జీతాల విషయంలో మాత్రం ఆడవాళ్ళు ఇవ్వాల్టికి వెనుకబడే ఉన్నారు. మగవాళ్లతో సమానంగా చాలామంది ఆడవాళ్లకు జీతాలు ఇవ్వకపోవడానికి చెప్తున్న కారణమేంటో తెలుసా.. వాళ్లు ఆడవాళ్లు కావడం.

ఈ 4 కాలాల్లో ఆమె జీవితం..

స్త్రీవాదం (ఫెమినిజం) అనే మాట వినే ఉంటారు కదా! మగవాళ్లతో పోల్చి చూస్తే ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదని, ఆడవాళ్ళకూ సమాన హక్కులు ఉండాలని చెప్పే సిద్ధాంతం ఫెమినిజం. వందేళ్ల కాలంలో ఫెమినిజం అనే ఆలోచనలో వచ్చిన మార్పులు ఆడవాళ్ల జీవితాలు ఆయా కాలాల్లో ఎలా ఉన్నాయో చెప్తాయి. ఫెమినిజం నాలుగోదశ నడుస్తోంది ఇప్పుడు. 

  • ఆడవాళ్లకు రాజకీయాల్లో చోటు కల్పించడం, ఆస్తిలో ఆమెకూ భాగమివ్వాలని పోరాడటం (1900-1959)
  • సమాజంలో ఆడవాళ్లపై చూపే వివక్షపై పోరాటం, మగవాళ్లతో సమాన హక్కుల కోసం పోరాడటం (1960-1980)
  • స్త్రీతనకు తాను స్వతంత్రంగా నిలబడగలదని చెప్పే ఉద్యమం (1980-2010)
  • ఇప్పుడు ఆర్థికంగా, సామాజికంగా స్త్రీ సొంతంగా నిలబడి, తనపై జరిగే అన్యాయాలను బయటికొచ్చి చెప్పే ఉద్యమం (2010 తర్వాత నుంచి...).
-వెలుగు, లైఫ్