
మహిళలను గౌరవించే సమాజం నిత్యం సస్యశ్యామలంగా ఉంటుందని ప్రగాఢంగా విశ్వసించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆడపడుచులకు పెద్దపీట వేసి పరిపాలిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా గుర్తింపు పొందిన ఇందిరా గాంధీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలోని మహిళలు అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా వివిధ బృహత్కరమైన కార్యక్రమాలను చేపడుతూ తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని సగర్వంగా నిరూపించుకుంటోంది. తెలంగాణ మహిళల సాధికారిత కోసం వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో అభయ హస్తంతో ముందుకు సాగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించేలా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఎన్నికల ముందే మహాలక్ష్మి పేరిట ఆడపడుచులకు అభయహస్తం కల్పిస్తూ మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రకటించింది. మహిళలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్లో మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.1892 కోట్లు కేటాయించి మహిళలపై తమకున్న నిబద్ధతను నిరూపించుకుంది. 2014లో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయానికి రూ.7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ఆర్థిక రంగం దివాలా తీసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారమైనా ఒక్కో హామీని అమలుచేస్తున్న మా ప్రభుత్వం తొలుత ఆడపడుచుల పథకాలను అమలుచేస్తూ వారి ఆశీర్వాదం అందుకొని విజయవంతంగా పాలన కొనసాగిస్తోంది.
బస్సుల యజమానులుగా మహిళలు
ఇచ్చిన మాటకు కట్టుబడుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అమలుచేసి వారికి ఆర్థికంగా లబ్ది చేకూర్చింది. ఉచిత ప్రయాణంలో సగటున రోజుకు 30 లక్షల మంది మహిళా ప్రయాణికులు ప్రయోజనం పొందుతుండడంతో వారికి రూ.1500 కోట్ల ఆదా అవుతోంది. ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం ఆర్టీసీకి నెలకు రూ.455 కోట్లు చెల్లిస్తూ ఆర్థిక భారాన్ని భరిస్తోంది. గతంలో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీకి ఉచిత బస్సు ప్రయాణంతో ఆక్యుపెన్సీ పెరిగి లాభాల బాట పట్టింది. రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం వీటిలో మహిళలను భాగస్వాములుగా చేయబోతోంది.
ఇందిరా మహిళా శక్తి పథకం కింద బ్యాంకు రుణాలతో ప్రతి మండల మహిళా సంఘానికి ఒక్కో బస్సు చొప్పున మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకి ఇచ్చేలా చర్యలు చేపట్టింది. దీంతో మహిళా సంఘాలకు ప్రతినెల రూ.77 వేల చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లిస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం పొందుతున్న మహిళలే మరోవైపు బస్సుల యజమానులుగా మారి రెండు వైపులా ప్రయోజనం పొందేలా గొప్ప నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది.
గ్యాస్ సబ్సిడీతో 40 లక్షల కుటుంబాలకు లబ్ధి
ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదురైనా కుటుంబ భారం మోస్తూ కుటుంబ గౌరవాన్ని కాపాడే మహిళల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ ఇన్సూరెన్స్ పెంపు పథకాలను కూడా అమలు చేసి చేదోడుగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై అందిస్తున్న రూ.500 సబ్సిడీతో సుమారు 40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో 50 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోంది.
పేదల్లో భరోసా నింపేలా ఆరోగ్యశ్రీ పథకం కింద ఇన్సూరెన్స్‌ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. మరోవైపు తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గం పరిధిలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరున అందజేసే ప్రక్రియ ప్రారంభించింది. అంతేకాక మహిళల పేరుమీదనే 40 లక్షలకుపైగా నూతన రేషన్ కార్డులను కూడా జారీ చేస్తుంది. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ తమ బాధ్యత తీరిపోయింది అనేలా కాకుండా మహిళల సమగ్రాభివృద్ధికి మరిన్ని పథకాలను ప్రారంభించింది.
ఇందిరా మహిళా శక్తి
భారత దేశ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పేరిట ‘ఇందిరా మహిళా శక్తి’ పథకంలో భాగంగా మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. కోటిమంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రంలోని స్వశక్తి మహిళా సంఘాలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 63.86 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో సభ్యత్వం తీసుకోవడం వారికి ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం. రాష్ట్రంలో ఇంటింటికీ తిరిగి ప్రతి మహిళకు సంఘాల్లో సభ్యత్వం కల్పించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
మహిళా సంఘాలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఏటా 5,000 గ్రామ సంఘాలకు రూ.5,000 కోట్లు కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘంలో చేరిన ప్రతి మహిళకు రూ.15.50 లక్షల ఆర్థిక సాయం అందజేయనుంది. వీరందరికీ ప్రభుత్వం రూ.5 లక్షల బీమా కల్పించనుంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం ఒక్కో భవన నిర్మాణానికి రూ. 5 కోట్ల చొప్పున మొత్తం 22 భవనాల కోసం రూ.110 కోట్లు మంజూరు చేసింది. సిరిసిల్లలో 60 ఎకరాల్లో అపెరల్ పార్కులో రెడీమెడ్ వస్త్రాల తయారీలో ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తోంది.
మహిళలకు పెట్రోల్ బంకులు
నారాయణపేటలో పూర్తిగా మహిళలే నిర్వహించేలా పెట్రోల్ బంకులు ప్రారంభించిన ప్రభుత్వం ఇకపై అన్ని జిల్లాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుంది. మహిళలచే ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇందిరా శక్తి క్యాంటీన్లను ప్రారంభించింది. కుట్టు శిక్షణతో సహా మరో 15 వ్యాపారాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం పాఠశాలల్లో యూనిఫాం కుట్టే పనులను కూడా మహిళలకే అప్పచెప్పింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 32 జిల్లాల్లో 64 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
హైదరాబాద్లోని శిల్పారామంలో 100 షాపులు ఏర్పాటు చేసి మహిళా వ్యాపారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపేట వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఆమోద యోగ్యమయ్యేలా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వలె బతుకమ్మను గడీల పాలకుల కుటుంబాలకే పరిమితం చేయకుండా అందరూ కలిసిమెలిసి చేసుకునేలా చర్యలు తీసుకుంది. పండుగ పేరుతో నాసిరకం చీరలు పంచకుండా మహిళలకు గౌరవం ఉండేలా వారికి ఏడాదికి రెండు నాణ్యమైన చీరలను ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది.
మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు
కోఠిలోని మహిళా యూనివర్సిటీకి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆమెను గౌరవించుకున్నాం. సామాజికవేత్త సావిత్రీబాయి ఫూలే పుట్టిన రోజును మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు మహిళలకు మంత్రి పదవులిచ్చి గౌరవించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టనుంది. పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మంది మహిళలతో చారిత్రాత్మక సభ ఏర్పాటు చేసి ‘ఇందిరా మహిళా శక్తి-2025 పథకం’ ప్రారంభిస్తుంది.
వడ్డీ లేని రుణాలకు సంబంధించి చెక్కులను ఇవ్వడంతో పాటు, ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన మహిళలకుటుంబాలకు రూ.40 కోట్ల బీమా అందజేసి ప్రభుత్వం ఆదుకోనుంది. 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసి మహిళలకు ఉపాధి కల్పించనుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలిసిన సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. యావత్ తెలంగాణ సమాజం ఇందుకు ఆమెకు సదా రుణపడి ఉంటుంది. మహిళా సాధికారితకు అభయహస్తం అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ మహిళలు మరింత ఆదరించి ఆశీర్వదించాలి.
బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు