కొల్లాపూర్ సభలో మహిళా డిక్లరేషన్: జూపల్లి

రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
పాలనను భ్రష్టు పట్టించారని కేసీఆర్​పై ఫైర్

మహబూబ్ నగర్, వెలుగు: మహిళల అభ్యున్నతి కోసం కొల్లాపూర్ సభలో ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో మంగళవారం కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ సభ నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరుతాయని వందేండ్లు బతకాల్సిన పిల్లలు ప్రాణ త్యాగాలు చేశారన్నారు. కానీ, రాష్ట్రంలో అందుకు భిన్నంగా పాలన సాగుతున్నదని విమర్శించారు. తొమ్మిదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజలను వంచించి పాలన సాగిస్తున్నదని ఫైర్ అయ్యారు. 

ALSO READ :బీఆర్ఎస్​లో అసమ్మతి సెగలు.. సర్పంచులతోనే ఎమ్మెల్యేకు దెబ్బ 

 

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా కేసీఆర్ అమలు చేయలేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్త హామీలు ఇవ్వడం.. పాతవి మరిచిపోవడం.. చేస్తున్నారన్నారు. ఇప్పటిదాకా ఇలాంటి అవినీతి, నియంతృత్వ పాలన చూడలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్, ఆయన కుటుంబాన్ని సాగనంపుతామన్నారు. పిడుగులు పడినా.. భారీ వర్షం కురిసినా.. కొల్లాపూర్ సభ విజయవంతం చేస్తామని తెలిపారు. పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేలా కష్టపడ్తామన్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ లీడర్లు మల్లు రవి, సంపత్​కుమార్, రామ్మోహన్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, కుంభం శివకుమార్ రెడ్డి, తిరుపతయ్య, వంశీకృష్ణ, జి.మధుసూదన్​రెడ్డి, వినోద్​కుమార్, ఒబేదుల్లా కొత్వాల్, సీజే బెనహర్ తదితరులు పాల్గొన్నారు.