- రాష్ట్రవ్యాప్తంగా రూ. 651 కోట్లు పెండింగ్
- ఎన్పీఏ జాబితాలో 61 వేల సంఘాలు
నల్గొండ, వెలుగు: స్త్రీ నిధి రుణాల బకాయిలు పేరుకుపోవడంతో మహిళా సంఘాలు సబ్సిడీ స్కీంలకు దూరమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 61 వేల సంఘాలు రూ.651.78 కోట్ల మేర బకాయి పడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో చేసిన అప్పులు ఎప్పటికి తీరుతాయో.. వాటిని ఎవరు తీరుస్తారో కూడా అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. సంఘాల్లో కొందరు సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో మొత్తం సంఘాల ఉనికే ప్రమాదంలో పడితే... ఇంకొన్ని జిల్లాలో విలేజ్ బుక్ కీపర్లు(వీబీకే), సెర్ప్ స్టాఫ్ కుమ్మకై చేసిన నిర్వాకం వల్ల అసలు, వడ్డీ అంతకంతకు పెరిగి చక్రవడ్డీకి దారితీసింది. ఈ పరిస్థితుల్లో తీసుకున్న రుణాలు కట్టలేక, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అమలు చేస్తున్న కొత్త స్కీంలకు మహిళలు అర్హత కోల్పోతున్నారు.
అప్పుల ఊబిలో 61 వేల సంఘాలు
స్త్రీనిధి లోన్లు తీసుకున్న సభ్యులు వరుసగా మూడు నెలలు బ్యాంకులకు కిస్తీలు కట్టకపోతే ఆ సంఘం మొత్తం నాన్పర్ఫార్మింగ్అసెట్స్(ఎన్పీఏ) జాబితాలో చేరుతుంది. కిస్తీలు రెగ్యులర్‌గా కట్టిన సంఘాలకే కొత్త లోన్లు ఇవ్వడం, కొత్త పథకాల్లో అర్హత లభిస్తుంది. కానీ ఇప్పుడున్న బకాయిలు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 61,233 సంఘాలు ఎన్పీఏ జాబితాలో ఉన్నాయి. ఈ సంఘాలు కట్టాల్సిన బకాయిలు విలువ రూ.651.78 కోట్లు. దీంట్లో ఇప్పటికిప్పుడు రూ.279.20 కోట్లు చెలిస్తే తప్ప ఎన్పీఏ జాబితా నుంచి బయటపడటం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. రుణాల రికవరీ కోసం సంఘాల చుట్టూ తిరుగుతున్న స్త్రీనిధి స్టాఫ్‌కు రకరకాల సమస్యలు ఎదురవుతున్నా యి. కొన్ని జిల్లాలో వీబీకేలు సంఘాల నుంచి వసూలు చేసిన కిస్తీల పైసలను స్వాహా చేసినట్లు తేలింది. ఇంకొన్ని జిల్లాలో సభ్యులు ఆర్థికంగా నష్టపోవడం వల్ల తీసుకున్న బకాయిలు తిరిగి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు.
కొత్త పథకాలకు అర్హత కోల్పోయినట్లే..
స్త్రీనిధి ఇచ్చే లోన్లకు వడ్డీ 11 శాతం అయితే.. ఎన్పీఏ జాబితాలో చేరడం వల్ల అసలు, వడ్డీ ఏళ్లకు ఏళ్లు పెరిగిపోయి ఇప్పుడు చక్రవడ్డీ పడుతోంది. దీనివల్ల సెర్ప్ ప్రవేశపెట్టిన కొత్త పథకాల్లో లబ్ధి పొందే చాన్స్ మహిళా సంఘాలు కోల్పోయాయి. సెర్ప్ ద్వారా 12 రకాల స్కీంలు అమలవుతున్నాయి. సభ్యులకు ఇచ్చే లోన్లతోపాటు, అదనంగా సోలార్ పవర్, ఎలక్ట్రిక్ ఆటో, ట్రాలీలు, కోడిపిల్లల పెంపకం కేంద్రాలు, బైక్లోన్లు, వీధివ్యాపారాలు, ఇంటి రిపేర్లు, జనరిక్ మెడికల్ షాపులు తదితరాలకు రూ.35 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంది. వీటిపై స్కీంను బట్టి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. కానీ ఎన్పీఏలో చేరిన సంఘాలకు ఈ లోన్లు ఇవ్వడం లేదని స్త్రీనిధి అధికారులు చెబుతున్నారు. అంతేగాక ఆయా జిల్లాల్లో గత మూడేళ్ల నుంచి స్త్రీనిధి రుణాల టార్గెట్లో కూడా భారీగానే కోత పెట్టారు. ఒకప్పుడు రూ.200 కోట్లు రుణాలు ఇచ్చిన జిల్లాలో ప్రస్తుతం రూ.150 కోట్లకు తగ్గించారు.
ప్రతి జిల్లాలో రూ. కోట్లలో బకాయిలు
2018–-19 నుంచి ఇప్పటివరకు పేరుకుపోయిన బకాయిలు వెనక సెర్ప్ ఉద్యోగుల హస్తం ఉందని స్త్రీ నిధి స్టాఫ్ చెబుతున్నారు. బకాయిల వసూళ్ల కోసం సభ్యుల దగ్గరకుపోతే ఆల్రెడీ వీబీకేలకు ఇచ్చేశామని చెబుతున్నారు. వీబీకేలను అడిగితే సమాధానం దాటవేసి, రివర్స్‌లో బెదిరిస్తున్నారని స్త్రీ నిధి స్టాఫ్ అంటున్నారు. వరుసగా మూడు నెలలు వసూలు చేసిన కిస్తీల్లో ఒక నెల స్త్రీనిధి ఖాతాకు జమ చేసి, మిగిలిన రెండు నెలల డబ్బులు వీబీకేల వద్ద రొటేషన్ జరుగుతోందని చెబుతున్నారు. ఈ రకంగా ఏళ్లకు ఏళ్లు బకాయిలు పెరిగిపోవడానికి సెర్ప్ ఉద్యోగులే ప్రధాన కారణమని అంటున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో రూ.73.16 కో ట్లు, జనగామలో రూ.19.59 కోట్లు, మేడ్చల్‌లో రూ.17.34 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో రూ.14.38 కోట్లు, ఆదిలాబాద్‌లో రూ.13.46 కోట్లు, జోగులాంబ జిల్లాలో రూ.6.99 కోట్లు బకాయిపడ్డాయి.