రాజ్యాంగ నిర్మాణంలో మహిళలది కీలకపాత్ర: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాజ్యాంగ నిర్మాణంలో మహిళలది కీలకపాత్ర: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: రాజ్యాంగం ద్వారానే సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి సాధ్యం అవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడీషియరీ కలిసి పని చేయాలని, అప్పుడే సామాన్య పౌరుడి జీవితం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ ప్రాంగణంలోని సెంట్రల్‌‌‌‌ హాల్‌‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు.

‘‘రాజ్యాంగం.. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతుంది. ప్రతి పౌరుడి ప్రాథమిక విధులు రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయి. మహిళల గౌరవానికి భరోసాగా నిలుస్తుంది. దేశానికి రాజ్యాంగం మూల స్తంభం. పార్లమెంట్ రూపొందించిన అనేక చట్టాల్లో ప్రజల ఆకాంక్షలు వ్యక్తం అవుతున్నాయి. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో పాటుపడుతున్నది. ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి. అభివృద్ధికి కొత్త అవకాశాలు అందిస్తున్నది’’అని ద్రౌపది ముర్ము అన్నారు.

రాజ్యాంగం మన పవిత్ర గ్రంథం

రాజ్యాంగం మన పవిత్ర గ్రంథమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ‘‘ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన జరిగింది. రాజ్యాంగానికి రాజేంద్రప్రసాద్‌‌, అంబేద్కర్ మార్గనిర్దేశం చేశారు. ప్రగతిశీల సూత్రాల గురించి రాజ్యాంగంలో పొందుపర్చారు. రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాలి. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. రాజ్యాంగ నిర్మాణంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారు. 

15 మంది మహిళల సేవలను మనం గుర్తు చేసుకోవాలి. మహిళా రిజర్వేషన్ల చట్టంతో మహిళా సాధికారత దిశగా కొత్తశకం మొదలైంది. పేదప్రజల సొంతింటి కల నిజమవుతున్నది. విద్యుత్, తాగునీరు, రోడ్డు సదుపాయాలు లభిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు కూడా అందుతున్నాయి. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

సమగ్ర అభివృద్ధి దిశగా చేపడుతున్న చర్యలు రాజ్యాంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాయి’’అని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ప్రసంగం అనంతరం సభ్యులందరితో కలిసి రాజ్యాంగ పీఠిక చదివారు. అంతకుముందు రాజ్యాంగానికి సంబంధించిన రెండు పుస్తకాలు, 75 ఏండ్లకు గుర్తుగా స్మారక పోస్టల్‌‌ స్టాంప్‌‌ను ఆమె విడుదల చేశారు. మైథిలీ, సంస్కృత భాషల్లో రాజ్యాంగాన్ని విడుదల చేశారు.

మతానికి ప్రాధాన్యతనిస్తే ముప్పు: ధన్ ఖడ్ 

దేశం కంటే మతానికి పార్టీలు ప్రాధాన్యతనిస్తే స్వాతంత్ర్యం ప్రమాదంలో పడుతుందని వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ ఖడ్ అన్నారు. గందరగోళం సృష్టించడాన్ని ఒక వ్యూహంగా అమలు చేస్తే.. ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పొడవునా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ మేరకు ధన్ ఖడ్ మాట్లాడారు. నిర్మాణాత్మక, అర్థవంతమైన చర్చల ద్వారా ప్రజాస్వామ్య దేవాలయాల పవిత్రతను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైనదని చెప్పారు.  

రాజ్యాంగమంటే కేవలం పుస్తకం కాదు: అమిత్ షా

ప్రతి వ్యక్తికి న్యాయం, సమాన హక్కులు నిర్ధారించడం రాజ్యాంగంతోనే సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దేశ అభివృద్ధిలో రాజ్యాంగ నిర్మాతల సహకారాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘రాజ్యాంగం అంటే కేవలం స్టేజీలపై ప్రదర్శించే పుస్తకం కాదు.. అందులోని విషయాలను పూర్తి భక్తితో పాటించడం ఎంతో కీలకం. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. బలమైన, సుసంపన్నమైన, స్వావలంబనతో కూడిన ఇండియాను నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేయాలి’’అని అమిత్ షా కోరారు. 

రాజ్యాంగంపై రెండ్రోజులు చర్చ జరగాలి: ప్రతిపక్ష నేతల డిమాండ్  

భారత్‎లో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు ఉభయసభల్లో రాజ్యాంగంపై చర్చ అవసరమని మంగళవారం విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఉభయసభల్లో రాజ్యాంగంపై రెండ్రోజుల పాటుచర్చ జరగాలని కోరుతూ తాను, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‎కు లేఖ రాశామని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. అందుకు సమయం కేటాయించాలని కోరామని చెప్పారు. ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కాగా, రాజ్యాంగ పీఠికను స్ఫూర్తితో అమలు చేస్తున్నారా..? అని కాంగ్రెస్ మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కేంద్రాన్ని ప్రశ్నించారు.