డేంజర్లో మహిళా భద్రత

దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచార ఘటనలు కామన్​ అయిపోయాయి. మహిళలపై అకృత్యాలు పెరిగిపోవడం వెనక ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆడవాళ్లు అర్ధరాత్రి నడిరోడ్డుపై ఏ భయం లేకుండా తిరిగినప్పుడే మనదేశానికి నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్ముడు చెప్పిన మాటలను గమనిస్తే.. ప్రస్తుతం దేశంలో మహిళలకు అర్ధ స్వాతంత్ర్యమే ఉన్నట్లు అనిపిస్తోంది. దేశంలో పరిస్థితులు ఇలా ఉంటాయని స్వాతంత్ర్యం వచ్చినప్పుడు గాంధీ కలలో కూడా ఊహించి ఉండరు. మహిళల అభివృద్ధి ఏమో కానీ, వారిపై అకృత్యాలు మాత్రం ఏడాది ఏడాదికీ పెరిగిపోతున్నాయి. తెలంగాణ నిత్య చైతన్య స్ఫూర్తికి నిదర్శనం. ఈ గడ్డ పోరాటాలకు పురిటిలోనే జన్మనిచ్చింది. మహిళలపై అకృత్యాలు, దారుణాలకు వ్యతిరేకంగా పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది. ఈ పోరాటం త్వరలోనే ప్రభుత్వాలకు కీలెరిగి వాత పెడుతుంది.

మహిళల భద్రత ఎంత డేంజర్ జోన్ లో ఉందో దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతోంది. నేషనల్​ క్రైం రికార్డ్స్​ బ్యూరో విడుదల చేసిన నివేదిక చూస్తే.. దేశంలో ప్రతిరోజు సగటున 88 రేప్​ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. 2018లో మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు 3,78,236గా ఉండగా, 2019నాటికి ఆ సంఖ్య 4,05,861కి పెరిగింది. 2018తో పోలిస్తే 2019లో మహిళలపై నేరాలు 7.3% పెరిగాయని క్రైమ్స్ ఇన్ ఇండియా నివేదిక వెల్లడించింది. 2018లో నేరాలు 58.8 శాతం ఉంటే 2019నాటికి అది 62.4 శాతానికి పెరిగిందని, రేప్​ కేసుల సంఖ్య 32,559 నుంచి 33,356కు పెరిగాయని పేర్కొంది.

నిత్యం దారుణాలే

2012లో ఢిల్లీలో నిర్భయ కేసు, 2019లో హైదరాబాద్‌‌లో దిశ కేసుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగినా, ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేసినా కొత్త కేసులు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు.. మూలాలు ఎక్కడ దాగి ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. ఏటా మహిళలపై నేరాలు పెరుగుతున్నా ఈ విషయాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిర్భయ ఘటన జరిగిన నాడు ఉవ్వెత్తున ఉద్యమించి, అప్పటి ప్రధానికి గాజులు, కుంకుమ, చీర పంపిన వారు.. ఇప్పుడు వందలాది నిర్భయలు మానవ మృగాల ధాటికి బలైపోతుంటే ఎందుకు స్పందించడంలేదు? గతంలో సివంగిలా గర్జించిన మహిళా నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉండటం ఎందుకు? ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా అత్యాచార ఘటనలు వెలుగు చూస్తుండటం పాలకుల అసమర్థత, లోపభూయిష్ట విధానాలకు అద్దం పడుతోంది. దేశం మొత్తంలో జరిగిన ఘటనల్లో యూపీలోనే 25.8 శాతం ఉన్నాయి. నిర్భయ ఉదంతానికి ఏమాత్రం తీసిపోనిది హత్రాస్ ఘటన. ఆ సమయంలో యూపీ పోలీసుల తీరు అనేక అనుమానాలకు తావిచ్చింది. యూపీ ప్రభుత్వం చెబుతున్న దానిలో మోసం లేకపోతే, అర్ధరాత్రి పూట బాధితురాలి అంత్యక్రియలు ఎందుకు? అత్యాచారం జరగలేదని చెప్పేందుకు పోలీసులకు ఎందుకంత అత్యుత్సాహం? మసి పూసి మారేడు కాయ చేసే వ్యవస్థ రాజ్యమేలుతుంటే నిజం అనాధ కాక ఏమౌతుంది?

మహిళలకు భద్రత ఎక్కడ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కూతవేటు దూరంలోనే దిశపై అత్యాచారం జరిగితే పోలీసులు సరైన సమయంలో రియాక్ట్ అవ్వలేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మహిళల రక్షణ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళల రక్షణ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. పరిస్థితులను ప్రభుత్వానికి ఏకరువు పెడుతూనే ఉన్నాం. మహిళా రక్షణ ఆందోళనకరంగా మారిందని గవర్నర్​ను కలిసి వినతిపత్రం ఇచ్చాం. మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరాం. అయినా మహిళా కమిషన్ ఏర్పాటు కాలేదు. వికృత ఆలోచనలకు దోహదం చేసే మద్యాన్ని నియంత్రించాలని కోరితే.. ప్రధాన ఆదాయ వనరుగా దానిని చూస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. దొరతనం రాజ్యం ఏలుతున్నప్పుడు ఆర్తనాదం అరణ్యరోదనే అవుతుంది కానీ, ఆర్తనాదాలకు చలించే హృదయాలు ఎక్కడుంటాయి? మరో బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఇంతటి దారుణ ఘటనలు కళ్లెదుట కనబడుతున్నా మాట్లాడే గొంతులు లేకపోవడం. ఈ దారుణాలపై కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మాట్లాడితే మా పార్టీకి మాట్లాడే అర్హత లేదంటూ ఒకే ఒక్క డైలాగ్ తో ఆరేండ్లుగా పాలన కొనసాగిస్తున్నారు. మరి మహిళా భద్రత విషయంలో ప్రస్తుత ప్రభుత్వాలు కల్పించిన భరోసా ఏంటన్నదానిపై
సమాధానం చెప్పాలి.

తెలంగాణలో ఎన్నో దారుణాలు

మహిళల భద్రత విషయంలో తెలంగాణలో పరిస్థితి అంత మెరుగ్గా లేదు. దిశ, హాజీపూర్, అమీన్ పూర్ ఘటనలు, వరంగల్‌‌లో 9 నెలల చిన్నారిపై, ఖమ్మంలో 13 ఏండ్ల బాలికపై రేప్.. వీటన్నింటినీ మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేశామని చెప్పుకున్న షీటీమ్​లు ఆపలేకపోయాయి. నిందితులను శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చేశామన్న భరోసా ఇవ్వడంలో వ్యవస్థ ఫెయిల్​ అయ్యింది. మొయినాబాద్ మైనార్టీ బాలిక రేప్ కేసులో నిందితుడిగా ఉన్న టీఆర్ఎస్ నేతను కాపాడేందుకు ఆ పార్టీ పెద్దలు విశ్వప్రయత్నాలు చేయడం ప్రభుత్వ పెద్దల చిత్తశుద్ధిని కళ్లకు కట్టింది. దిశపై అత్యాచారం జరిగినప్పుడు ఓ మంత్రి.. ఇంటికో పోలీసును పెట్టలేం కదా అంటూ ప్రభుత్వ అసమర్థతను చాటుకున్నారు. తెలంగాణలో జరిగిన ఈ ఘటనలు నిర్భయ ఉదంతానికి ఏమాత్రం తీసిపోనివే. అందుకే టీఆర్ఎస్ నాయకత్వం నోటికి తాళం పడింది.

అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడితే యువరాజు ‘‘మీ సంఖ్యను ప్రజలు నిర్ణయించారు. మీకు అంతే సమయం ఇస్తాం”అంటూ భజన బృందంతో బల్లలు చరిపించుకుంటారు. నిజానికి కాంగ్రెస్ కు ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత యువరాజా? తమరు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? కొందరిని ప్రలోభపెట్టి లొంగదీసుకున్నారు. గట్టిగా నిలదీసే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ తెలంగాణకు ఉన్న చైతన్య స్ఫూర్తిని నాశనం చేసే పనిలో తండ్రీకొడుకులు నిమగ్నమయ్యారు. తెలంగాణ గడ్డ పోరాటాలకు పుట్టిల్లు. పోరాటం ఇప్పుడే మొదలైంది. ప్రభుత్వాలకు త్వరలోనే సరైన గుణపాఠాలు చెప్పే రోజు వస్తుంది. అప్పటి వరకు  తస్మాత్ జాగ్రత్త.

– ఇందిరాశోభన్,
పీసీసీ అధికార ప్రతినిధి