- ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్‌లో 14 వేల జంటలను ఏకం చేసిన విమెన్ సేఫ్టీ వింగ్
- చిన్నచిన్న గొడవలతోనే విడాకుల దాకా వెళ్తున్నరు
- అనుమానాలు, అసూయలతో ఠాణా మెట్లు ఎక్కుతున్నరు
- వారిని ఒప్పించి, ఒక్కటి చేస్తున్న ఫ్యామిలీ కౌన్సెలర్లు
హైదరాబాద్, వెలుగు: రకరకాల కారణాల వల్ల ఇంట్లో గొడవలు పడి విడిపోయేదాకా వెళ్తున్న జంటలను విమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు మళ్లీ కలుపుతున్నారు. గొడవల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చి.. ఒక్కటిగా కలిసి ఉండేలా చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడటంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు.. కుటుంబ కలహాలతో విడిపోదామనుకున్న జంటలను ఏకంచేస్తూ తమలోని మరో కోణాన్ని చాటుకుంటున్నారు. కారణాలు ఏవైనా సరే ఠాణా మెట్లు ఎక్కు తున్న భార్యాభర్తల మధ్య వివాదాలను రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో పరిష్కరిస్తున్నారు.
ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే విడిపోదామనుకున్న 14 వేల జంటలను వీరు ఒక్కటి చేశారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఫర్ విమెన్ (సీడీఈడబ్ల్యూ) సెంటర్ల ద్వారా దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించి, కలిసి ఉండేందుకు మార్గాలు చూపుతున్నారు. అడ్డా కూలీల దగ్గర నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ వరకు, పొలిటికల్ లీడర్ల నుంచి సినీ సెలబ్రెటీల వరకు ఎంతో మంది విడాకుల వరకు వచ్చిన భార్యాభర్తల మధ్య వీరు సయోధ్య కుదుర్చుతున్నారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 27 ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు పని చేస్తున్నాయి. నిపుణులైన కౌన్సెలర్లతో దంపతులకు కౌన్సెలింగ్ సెషన్లు జరుగుతున్నాయి. ఇలా ఈ ఏడాది కాలంలో 44 వేల కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించగా, 14 వేల జంటలు ఏకం కావడం విశేషం.
మద్యం, ఈగో, ఆర్థిక ఇబ్బందులతో..
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు చిచ్చురేపుతున్నాయి. మద్యానికి బానిసలైన భర్తలు తాగిన మైకంలో భార్యలను చిత్రహింసలు పెడుతున్న కేసులు పేద కుటుంబాల్లో ఎక్కువగా ఉంటున్నాయని విమెన్ సేఫ్టీ వింగ్ అంటోంది. కార్పొరేట్ఉద్యోగాలు చేసే భార్యభర్తల మధ్య అహం కాపురాల్లో కల్లోలం రేపుతోంది. మధ్య తరగతి వారిలో ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల వల్ల దంపతుల మధ్య అగాధాలు ఏర్పడుతున్నాయని కేసులను బట్టి తెలుస్తోంది. వరకట్న వేధింపులు, గృహ హింస కేసులతో దంపతులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల ఆర్థికంగా, మానసింగా చితికిపోతున్నారు. పిల్లల భవిష్యత్తును కూడా రోడ్డున పడేస్తున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు,పెద్దలు సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ వినడం లేదు. పోటాపోటీగా కోర్టు మెట్లు ఎక్కి పంతాన్ని నెగ్గించుకోవడానికి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇక పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసుల్లో భర్త, అత్తమామల చేతుల్లో గృహహింసకు గురవుతున్న మహిళలే ఎక్కువగా ఉంటున్నారు.
ఒక్కో జంటకు 5 నుంచి10 సెషన్లు..
భార్యాభర్తల వివాదాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక పోలీసులకు, సఖి సెంటర్లకు ఏటా 60 వేల నుంచి 70 వేల పిటిషన్లు అందుతున్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో గడిచిన ఏడాదిన్నర కాలంలో 20 వేల మంది బాధితులు విమెన్ సేఫ్టీ వింగ్‌ను ఆశ్రయించారు. వీరికి సీడీఈడబ్ల్యూ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కేసుల సంఖ్యను బట్టి ఇద్దరు కౌన్సెలర్లు సహా ఐదుగురు మహిళా సిబ్బంది పని చేస్తున్నారు. భార్యాభర్తలకు 5 నుంచి 10 సెషన్ల వరకు కౌన్సెలింగ్ఇస్తున్నారు. ముందుగా గొడవలకు కారణం ఏమిటో దంపతులు, పేరెంట్స్‌తో మాట్లాడి ఓ అంచనాకు వస్తారు. తప్పు ఎక్కడ జరుగుతోందో గుర్తిస్తారు. భార్యాభర్తలతో విడిగా మాట్లాడి, తర్వాత ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి మాట్లాడుతారు. తర్వాత పరిష్కార మార్గాలను చూపుతున్నారు. విడిపోతే తలెత్తే సమస్యలు, ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రుల భవిష్యత్, వారిపై ఆధారపడిన ఇతర కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటో వివరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు దంపతులను ఒక్కటి చేసేలా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అందుకే 40 శాతం సక్సెస్ రేట్ సాధిస్తున్నామని విమెన్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు.
ఉప్పల్‌లో నివసించే ఓ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ భర్త మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేశాడు. దీంతో విసిగిపోయిన లెక్చరర్ స్థానిక పోలీసులను ఆశ్రయిం చింది. ఉప్పల్ సీడీఈడబ్ల్యూ సెంటర్ కౌన్సెలర్లు దంపతు లిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. లెక్చరర్ భర్తలో మార్పు తీసుకువ చ్చారు. ప్రస్తుతం ఆ లెక్చర్ దంపతులు ఆనందంగా కలిసి జీవిస్తున్నారు.
వేర్వేరు ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఓ యువతి, మరో యువకుడికి గతేడాది వివాహం జరిగింది. ఇద్దరికీ ప్రతి నెలా లక్షల్లో జీతాలు. డబ్బుకు కొదవ లేదు. కానీ సంపాదన అనే అహంభావం ఇద్దరి మధ్య చిచ్చుపెట్టింది. ఒకరికి ఒకరు అవసరం లేదనే స్థాయికి వివాదం చేరింది. దీంతో పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదాన్ని కౌన్సెలర్లు సానుకూలంగా పరిష్కరించారు. అహంభావం ఎంతవరకు దారి తీస్తుందో ఉదాహరణలతో సహా వివరించారు. దీంతో ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు.
కలిపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం
గృహహింసకు గురవుతున్న మహిళలు ఎంతో బాధతో మా వద్దకు వస్తారు. ముందుగా దంపతుల మధ్య తలెత్తిన వివాదానికి కారణాలు తెలుసుకుంటాం. తీవ్రతను బట్టి భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తుంటాం. గృహహింస కేసుల్లో కౌన్సెలింగ్ ఎంతో కీలకం. బాధిత మహిళలకు భరోసా కలిగించడంతో పాటు కాపురాలను నిలబెట్టడం కౌన్సెలర్స్‌గా మా బాధ్యత. మా వద్దకు వచ్చే దంపతులను ఒక్కటి చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటాం. - ప్రశాంతి, కౌన్సెలర్, సీడీఈడబ్ల్యూ, పంజాగుట్ట
40% సక్సెస్ రేట్ సాధించాం
మా దగ్గరికి వస్తున్న కేసుల్లో గృహ హింసకు సంబంధించినవే ఎక్కువ ఉంటున్నాయి. బాధిత మహిళలకు న్యాయం చేసేలా కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నాం. దంపతుల మధ్య తలెత్తే చిన్నచిన్న సమస్యలను కౌన్సెలింగ్‌తో పరిష్కరిస్తున్నాం. ఇలా ఈ ఏడాది 40 శాతం సక్సెస్ రేట్ సాధించాం. గృహహింసకు గురవుతున్న బాధితులు సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా విమెన్ పీఎస్‌లలో ఫిర్యాదు చేయాలి. అవసరమైతే లక్డీకపూల్‌లోని విమెన్ సేఫ్టీ వింగ్ హెడ్‌క్వార్టర్స్‌ను సంప్రదించవచ్చు. సహాయం కోసం 040–49638510 ఎక్స్‌టెన్షన్ 222కు కాల్ చేయవచ్చు. - శిఖాగోయల్, అడిషనల్ డీజీ, విమెన్ సేఫ్టీ వింగ్
గ్రేటర్ పరిధిలో
కౌన్సెలింగ్ తో ఒక్కటైన జంటలు: 14,000
దంపతులకు కౌన్సెలింగ్ సెషన్స్: 44,000
లబ్ధి పొందిన వారి సంఖ్య: 50,000
గృహహింసకు ప్రధాన కారణాలివే..
మద్యం: 63.2 శాతం
ఆర్థిక పరిస్థితులు: 50 శాతం
అనుమానాలు: 48 శాతం
వివాహేతర సంబంధాలు: 33 శాతం
విద్యార్హతలు భార్య(శాతం)/భర్త(శాతం):
టెన్త్, ఇంటర్ వరకు 36/34 శాతం
గ్రాడ్యుయేషన్ 26/24
టెన్త్ లోపు, నిరక్ష్యరాస్యులు 11/14
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం: 88 శాతం
శాలరీడ్: 46 శాతం
సెల్ఫ్ ఎంప్లాయిస్: 46.2 శాతం
బాధిత మహిళల సంపాదన
నెలకు రూ.5 వేల నుంచి రూ.20 వేలు: 24 శాతం
రూ.11 వేల నుంచి రూ. 30 వేలు: 50 శాతం