దుబాయ్: విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి తరలించారు. ఈ మేరకు ఐసీసీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. బంగ్లాలో అల్లర్ల కారణంగా మెగా టోర్నీ అక్కడ నిర్వహించడం సాధ్యం కాదని గవర్నింగ్ బాడీ తెలిపింది. టోర్నీలో పాల్గొనే దేశాలు బంగ్లాదేశ్‌కు రావడానికి విముఖత వ్యక్తం చేయడంతో వేదికను మార్చాల్సి వచ్చిందని వెల్లడించింది. అయితే ఆతిథ్య హక్కులు మాత్రం బంగ్లాదేశ్ వద్దనే ఉంటాయి. వచ్చిన ఆదాయాన్ని యూఏఈతో కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు దుబాయ్, షార్జాలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
‘బంగ్లాదేశ్‌లో ఓ మంచి టోర్నీ జరుగుతుందని ఆశించాం. కానీ పరిస్థితులు బాగాలేవు. అందుకే టీ20 వరల్డ్ కప్‌ను అక్కడి నుంచి తరలించాం. ఇతర దేశాల బోర్డులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్‌లో అక్కడ ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అల్లార్డిస్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ వెళ్లడానికి కొంత మంది విమెన్ క్రికెటర్లు కూడా విముఖతను చూపెట్టారని అందుకే తరలింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. శ్రీలంక, జింబాబ్వే కూడా ముందుకు వచ్చినా యూఏఈలో ఉండే లాజిస్టిక్ వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ నిర్వహించేందుకు మొగ్గు చూపామని అల్లార్డిస్ తెలిపారు.