దుబాయ్: విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా కీలక పోరుకు రెడీ అయ్యింది. గ్రూప్–ఎలో భాగంగా ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉండే నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ మ్యాచ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడటంతో ఇండియా రన్‌రేట్ –2.99కు పడిపోయింది. దీన్ని మెరుగుపర్చుకోవాలంటే పాక్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాలి.
కాంబినేషన్స్‌పై దృష్టి..
పాక్‌తో మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు చేయకపోయినా కాంబినేషన్‌పై టీమిండియా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కివీస్‌తో మ్యాచ్‌కు ఎక్స్‌ట్రా పేసర్ అరుంధతి రెడ్డిని ఆడించేందుకు ఓ బ్యాటర్‌ను త్యాగం చేసింది. ఫలితంగా హర్మన్, జెమీమా, రిచా వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావడం ఘోరంగా బెడిసికొట్టింది. నాలుగో ప్లేస్‌లో బలంగా బ్యాటింగ్ చేసే హర్మన్.. మూడో ప్లేస్‌లో మాత్రం ఫెయిలవుతోంది. గత 19 మ్యాచ్‌ల్లో ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేకపోయింది. మంచు లేకపోవడంతో ముగ్గురు పేసర్లను ఆడించారు. ఇది తప్పుకాకపోయినా, పిచ్‌ను సరైన విధంగా ఉపయోగించుకోలేదు.
అదే కివీస్ పేసర్లు హార్డ్ వికెట్‌ను బాగా సద్వినియోగం చేసుకున్నారు. ముగ్గురు పేసర్లు ఉండటంతో టీ20ల్లో థర్డ్ బెస్ట్ బౌలర్ అయిన పూజా వస్త్రాకర్‌కు ఒకే ఒక్క ఓవర్ వేసే చాన్స్ వచ్చింది. అలాగే రాధా యాదవ్‌ను పక్కనబెట్టడం కూడా భారీ దెబ్బతీసింది. కాబట్టి పాక్‌తో మ్యాచ్‌కు ఈ కాంబినేషన్స్‌ను మరోసారి సరి చూసుకోనున్నారు. బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకు హేమలతకు చాన్స్ ఇవ్వనున్నారు. పాక్‌తో ఆడిన 15 మ్యాచ్‌ల్లో ఇండియా 12 గెలవడం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. వరల్డ్‌కప్‌లో ఏడు ఆడితే ఐదింటిలో నెగ్గారు.
బౌలింగే బలం..
తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై నెగ్గిన పాకిస్తాన్ మంచి జోరుమీదుంది. వీళ్ల బ్యాటింగ్ కంటే బౌలింగ్‌తోనే ఎక్కువ ప్రమాదకరం. అనుభవజ్ఞులైన నిడా డర్, ఫాతిమా సనా, సైదా ఇక్బాల్ పేస్ అటాక్‌ను నడిపిస్తున్నారు. లంకతో మ్యాచ్‌లో కాలిపిక్క నొప్పికి గురైన డయానా బేక్ అందుబాటులో ఉంటుందో లేదో తెలియదు. బ్యాటింగ్‌లో మునీబా లీ, గుల్ ఫెరోజ్, సోహైల్, తౌబా హసన్‌పై ఎక్కువ భారం పడనుంది.
జట్లు (అంచనా)
ఇండియా: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, యాస్తికా, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా, రిచా ఘోష్, పూజా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, హేమలత, ఆశా శోభన, రాధా, శ్రేయాంక పాటిల్, సాజన.
పాకిస్తాన్: ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేక్, గుల్ ఫెరోజా, ఇరామ్ జావేద్, మునీబా అలీ, నష్రా సంధు, నిడా డర్, ఒమైమా సోహైల్, సదాఫ్ శామ్స్, సైదా ఇక్బాల్, సిద్రా అమిన్, సైదా అరూబ్ షా, తస్మియా రుబాబ్, తౌబా హసన్.