- తెలంగాణసహా 19 రాష్ట్రాల్లో సగటున 7.8 లక్షలు పెరిగిన ఓట్లు
- 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే
- 2024లో పోలైన ఓట్లు 1.8 కోట్లు ఎక్కువ
- తెలంగాణసహా 19 రాష్ట్రాల్లో సగటున 7.8 లక్షలు పెరిగిన ఓట్లు
- మన రాష్ట్రంలో 2019తో పోలిస్తే 17 లక్షలు పెరుగుదల
- ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్‌లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా గత పదేండ్లలో 9.2 కోట్ల మందికిపైగా ఫస్ట్ టైం ఓటర్లు ఓటేస్తే అందులో 5.3 కోట్ల మంది మహిళలేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. అంటే ఓటేసిన కొత్తవారిలో 58 శాతం మంది మహిళలేనని పేర్కొన్నది. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో ఓటేసిన మహిళల (పాత, కొత్త కలిపి) సంఖ్య 1.8 కోట్లు పెరిగినట్టు రిపోర్ట్ వెల్లడించింది.
ఇంట్లో టాయిలెట్ ఉండడం, మహిళలు చదువుకోవడం, వివిధ రాష్ట్రాలు మహిళా స్కీమ్స్ అమలు చేయడం, మహిళల సంపాదన వంటి అంశాలు వారు ఓటేయడంలో ప్రధాన అంశాలుగా మారాయని తెలిపింది. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ఇటీవల ఎస్బీఐ రీసెర్చ్ దీనిపై రిపోర్ట్ విడుదల చేసింది.
తెలంగాణలో పెరిగిన సంఖ్య
తెలంగాణ సహా 19 రాష్ట్రాల్లో సగటున 7.8 లక్షల మంది చొప్పున ఓటేసిన మహిళల సంఖ్య పెరిగిందని, ఆయా రాష్ట్రాలన్నీ కలిపితే 1.5 కోట్ల మేర మహిళల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయని ఎస్బీఐ రిపోర్ట్‌లో పేర్కొన్నది. మిగతా అన్ని రాష్ట్రాలు కలిపితే సగటున 2.5 లక్షలే ఎక్కువని తెలిపింది. తెలంగాణలో 2019లో 92 లక్షల మంది మహిళలు ఓటేస్తే.. 2024లో 1.09 కోట్ల మంది ఓటేసినట్టు వెల్లడించింది. ఆ లెక్కన మన రాష్ట్రంలో ఓటేసిన మహిళల సంఖ్య 17 లక్షలు పెరిగింది.
దేశంలో పోలింగ్ శాతం బెటర్
ప్రపంచంలో 2024లో ఎన్నికలు జరిగిన దేశాల్లో పోలైన ఓట్లతో పోలిస్తే భారత్ బెటర్ స్థానంలో నిలిచినట్టు రిపోర్ట్ పేర్కొంది. ఎక్కువ పోలింగ్ శాతం నమోదైన టాప్ టెన్ దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నట్టు పేర్కొన్నది. ఫస్ట్ ప్లేస్‌లో 76.6 శాతం పోలింగ్‌తో జర్మనీ ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో 66.6 శాతం పోలింగ్‌తో ఫ్రాన్స్, స్పెయిన్ ఉన్నాయి. ఇక, 66.1 శాతం ఓటింగ్ తో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది.
అగ్రరాజ్యం అమెరికాలో మనకన్నా తక్కువగా 63.9 శాతం పోలింగ్ నమోదైనట్టు రిపోర్ట్ వెల్లడించింది. కాగా, గత ఎన్నికల్లో దాదాపు 30 కోట్ల మంది ఓటేయలేదని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ఆబ్సెంటీ ఓటింగ్ సిస్టమ్‌ను తీసుకొస్తే బాగుంటుందని ఎలక్షన్ కమిషన్‌కు సూచించింది.