- ఫైనల్లో చైనాకు చెక్
- జపాన్‌కు బ్రాంజ్ మెడల్
రాజ్‌గిర్ (బిహార్) : విమెన్స్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా అదరగొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. బుధవారం హోరాహోరీగా జరిగిన ఫైనల్ ఫైట్‌లో ఇండియా 1–0తో పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ చైనాకు చెక్ పెట్టింది. ఇండియా తరఫున దీపిక (31వ ని) ఏకైక గోల్ చేసింది. 2016, 2023లోనూ టీమిండియా ఈ టైటిల్‌ను గెలిచింది.
దీంతో టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు టైటిల్ నెగ్గిన జట్టుగా సౌత్ కొరియా (3)తో సమంగా నిలిచింది. చివరి వరకు టైటిల్ కోసం పోరాడిన చైనా మూడోసారి కూడా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఇక మూడో ప్లేస్ కోసం జరిగిన వర్గీకరణ పోరులో జపాన్ 4–1తో మలేసియాపై గెలిచింది.
గోల్స్ కోసం హోరాహోరీ..
లీగ్ దశలో చైనాను ఓడించిన ఇండియా.. అదే ఫామ్, జోరును ఫైనల్లోనూ కొనసాగించింది. అయితే గోల్స్ కోసం చైనా కూడా తీవ్రంగా ప్రయత్నించడంతో ఇరుజట్ల మధ్య పోరాటం హోరాహోరీగా సాగింది. సర్కిల్‌లోకి చొచ్చుకుపోయేందుకు రెండు జట్లు చాలా శ్రమించాయి. అయితే బ్యాక్ లైనప్ బలంగా ఉండటంతో అంత ఈజీగా గోల్స్ రాలేదు. ఇండియా యంగ్ ప్లేయర్ 17 ఏళ్ల సునెలితా టోప్పో తన డ్రిబ్లింగ్ నైపుణ్యంతో రెండు పార్శ్వాల నుంచి చైనా డిఫెన్స్‌ను ఛేదించే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు.
రెండో క్వార్టర్ మూడో నిమిషంలో చైనాకు తొలి పెనాల్టీ కార్నర్ లభించినా ఇండియా గోల్ కీపర్ బిచూ దేవి సూపర్ డైవ్ చేసి అడ్డుకుంది. తర్వాతి రెండు నిమిషాల్లో ఇండియాకు నాలుగు పెనాల్టీలు లభించాయి. ఇందులో దీపిక ఎక్కువ చాన్స్ తీసుకున్నా గోల్ పోస్ట్‌లోకి పంపలేకపోయింది. 23వ నిమిషంలో లభించిన పెనాల్టీని కూడా ఇండియా ఫార్వర్డ్స్ వృథా చేశారు. తర్వాతి నిమిషంలో కెప్టెన్ సలీమా ఇచ్చిన ఓ సూపర్ షార్ట్ పాస్‌ను గోల్ పోస్ట్ ముందరే ఉన్న షర్మిలా దేవి వృథా చేసింది. దీంతో హాఫ్ టైమ్‌కు ఇరుజట్లు 0–0 స్కోరుతో నిలిచాయి.
సెకండాఫ్‌లో చైనీస్ డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచిన దీపిక ఐదో పెనాల్టీని సాధించింది. దీన్ని రివర్స్ హిట్‌తో గోల్‌గా మల్చడంతో ఇండియా 1–0 లీడ్‌లోకి వెళ్లింది. 42వ నిమిషంలో ఇలాంటి చాన్సే వచ్చినా దీపిక సద్వినియోగం చేసుకోలేదు. మరో రెండు నిమిషాల తర్వాత సుశీలా చానూ కొట్టిన ఆరో పెనాల్టీ కూడా ఫెయిలయ్యింది. ఇండియా ఫార్వర్డ్స్‌ను దీటుగా నిలువరించిన చైనా కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేసింది. చాలాసార్లు ఇండియా సర్కిల్‌లోకి దూసుకొచ్చారు. కానీ బలమైన డిఫెన్స్‌ను ఛేదించలేక గోల్ కొట్టలేకపోయారు.