
- బెంగాల్ సీఎం మమతకు యూపీ సీఎం యోగి కౌంటర్
- కుంభమేళా కోట్లాదిమంది ప్రజల నమ్మకమని వివరణ
లక్నో: తప్పుడు ఆరోపణలతో మహాకుంభ్‌ను కించపరిస్తే సహించేదిలేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మహాకుంభమేళా మతపరమైన కార్యక్రమం మాత్రమేకాదని, భారత దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. సనాతన ధర్మం దేశ ఆత్మవంటిదని, దాని గౌరవాన్ని కాపాడటం మన కర్తవ్యమని చెప్పారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో యోగి మాట్లాడారు. నిర్వహణ లోపాల కారణంగా తొక్కిసలాట జరిగి సాధారణ జనాలు ప్రాణాలు కోల్పోతున్నారని, మహాకుంభ్.. మృత్యు కుంభ్‌గా మారుతోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన కామెంట్లకు యోగి కౌంటర్ ఇచ్చారు.
మహాకుంభ్‌ను కించపర్చేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 56 కోట్ల మంది ప్రజలు పవిత్రస్నానాలు చేశారని చెప్పారు. మమతా బెనర్జీ ఆరోపణలు ఈ 56 కోట్ల మంది విశ్వాసంతో ఆడుకోవడంలాంటివేనని అన్నారు. కుంభమేళాలో జనవరిలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 30 కుటుంబాలకు యూపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని యోగి హామీ ఇచ్చారు. ఆ కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. తొక్కిసలాట ఘటనను మమతా బెనర్జీ రాజకీయం చేస్తున్నారని యూపీ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ మండిపడ్డారు.
ఏర్పాట్లు ముందే ఎందుకు చేయలే..
మహా కుంభ్ నిర్వాహకులు క్రౌడ్ మేనేజ్‌మెంట్ సరిగా చేయలేదని ఉత్తరాఖండ్‌లోని జోతిష్ పీఠానికి చెందిన 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతీ మహారాజ్ ఉత్తరప్రదేశ్ సర్కారును తప్పుపట్టారు. ‘300 కిలీమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇది నిర్వహణ లోపం కాక మరేంటి?’ అని ఆయన ప్రశ్నించారు. సాధారణ భక్తులు లగేజీ పట్టుకుని 25 నుంచి 30 కిలోమీటర్లమేర నడవాల్సివస్తోందని అన్నారు.
స్నానం చేయాల్సిన గంగానదిలో డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నాయని, 12 ఏండ్లకోసారి కుంభమేళా వస్తుందని ముందే తెలిసినా, వచ్చే భక్తులకు అనుకూలంగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఆయన యూపీ సర్కారును ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా మమతకు మద్దతుగా మాట్లాడారు. ‘ఆమె చెప్పింది నిజమే. కుంభమేళా ఏర్పాట్లు సక్కగ లేక తొక్కిసలాట జరిగింది. జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కారకులెవరనేది ఇప్పటికీ గుర్తించలే, ఎవరిమీదా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలే’ అని అఖిలేశ్ అన్నారు.