టార్గెట్​ 4 లక్షల టన్నులు .. యాదాద్రిలో ధాన్యం కొనుగోలు సెంటర్లు షురూ

  • 5.25 టన్నుల ధాన్యం వస్తుందని అంచనా
  • జిల్లాలో 323 సెంటర్లు ఏర్పాటు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభమయ్యాయి. వరి కోతలు ముమ్మురంగా సాగుతుండడంతో ఉగాది తర్వాత ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. జిల్లాలో 2.93 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఈసారి వానలు సరిగా లేకపోవడం, భూగర్భ జలాలు తగ్గముఖం పట్టడంతో కొన్ని చోట్ల పంటలు ఎండిపోయాయి. దీంతో పంట దిగుబడి తగ్గనుంది. పంట సాగు చేసిన ప్రకారం 6 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా 5. 25 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. 

ప్రారంభమైన కోనుగోళ్లు.. 

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అధికారులు ​4 లక్షల టన్నులను ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 5. 25 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినప్పటికీ దళారులు ఇప్పటికే రంగ ప్రవేశం చేయడంతోపాటు ఇప్పటికే మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల మండలాల్లో వడ్ల కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ కారణంగా సెంటర్లకు ధాన్యం తక్కువగా వస్తాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. 

జిల్లాలో 323 సెంటర్లు.. 

జిల్లాలో 323 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఐకేఈ 85 సెంటర్లు, పీఏసీఎస్​228 సెంటర్లు, అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో 10 ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయనుంది. వానకాలంలో 314 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఇప్పుడు 323 సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సోమవారం 43  ధాన్యం కొనుగోలు సెంటర్లను  ప్రారంభించారు. మిగిలిన సెంటర్లు ఉగాది పండుగ వరకూ ఓపెన్​ చేయనున్నారు. వరి కోతలు కూడా ఇప్పుడిప్పుడే ముమ్మురం కావడంతో పండుగ తర్వాత కొనుగోళ్లు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. 

వెంటవెంటనే అన్​లోడ్​చేయించాలి

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వడ్లను వెంటనే అన్​లోడ్​చేయించాలి. కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా జరిగేందుకు అందరూ సహకరించాలి. అవసరమైన స్థాయిలో హమాలీల సంఖ్యను పెంచుకోవాలి. 

బెన్​షాలోమ్, అడిషనల్​కలెక్టర్​